Meditation : ఏది అసలైన ధ్యానం?
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:21 AM
‘ధ్యానం’ అంటే రోజూ ఒక భంగిమలో కాసేపు కళ్ళు మూసుకొని, శ్వాస లాంటి ఏదో ఒక విషయం మీద దృష్టి నిలపడం అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది.

చింతన
‘ధ్యానం’ అంటే రోజూ ఒక భంగిమలో కాసేపు కళ్ళు మూసుకొని, శ్వాస లాంటి ఏదో ఒక విషయం మీద దృష్టి నిలపడం అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. ఈ ప్రక్రియ వల్ల తాత్కాలికమైన ప్రశాంతత కలుగుతుందేమో కానీ... మనసులోని సంఘర్షణలు, జీవితంలో దుఃఖం మాత్రం తొలగిపోవడం లేదు. ఈ వాస్తవం మనందరికీ తెలుస్తూనే ఉంది. మరి ఏది అసలైన ధ్యానం? మనం ఏ విషయాన్నైనా మనసుతోనే గ్రహిస్తాం. అందుకే జీవితం గురించి స్పష్టత రావాలంటే... మనసు గురించి లోతుగా తెలియాలి. శరీరాన్ని అద్దంలో చూసుకోవడం మనకు అలవాటే. ఆ సమయంలో మన ఆకార వికారాలు మన అవగాహనలోకి వస్తాయి. అలాగే, మన మనసును మనమే అద్దంలో చూసుకోగలమా? దాని తీరుతెన్నులను సాక్షిలా గమనించగలమా? అవును. అటువంటి నిశితమైన, నిరంతరమైన పరిశీలనే ధ్యానం. మనసు మాయలు కనిపెట్టడమే ధ్యానం
అరువు తెచ్చుకున్న జ్ఞానం
దేవుడు, మత విశ్వాసాలు, జీవితం పట్ల దృక్పథం... ఇలా మన జీవితాన్ని నడిపే ముఖ్యమైన విషయాల పట్ల మనకున్న అభిప్రాయాల్లో ఎక్కువ శాతం మన అనుభవం లోంచి వచ్చినవి కావు. ఇది ఇతరుల నుంచి వచ్చిన ‘సెకెండ్ హ్యాండ్’ జ్ఞానం. అలా అనేకానేక ప్రభావాలు, నమ్మకాలు, అరువు తెచ్చుకున్న జ్ఞానంతో మన మనసు కండిషన్ (నిబద్ధీకరణ) అయిపోయింది. అలాంటి మనసు... దుమ్ము పట్టిన కళ్ళద్దాలలాంటిది. కళ్ళద్దాల మీద మురికి పేరుకుపోతే వాటి ద్వారా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరిగ్గా చూడలేం. అలాగే, రకరకాల నిబద్ధీకరణలతో నిండిన మనసు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేదు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సహకరించలేదు. అలాంటి మనసు ఉన్నంతవరకూ... దుఃఖం, సంఘర్షణల నుంచి మనకు విముక్తి లేదు. సత్యం వైపు మనం ప్రయాణించే అవకాశమే లేదు. శరీరం మీద ఆచ్ఛాదనలు తొలగినప్పుడు అసలు రూపం బయటపడినట్టే... మనసు మీద ఏర్పడిన ప్రభావాల గురించి, నిబద్ధీకరణ పొరల గురించి స్పృహ కలిగినట్టైతే... అవి వాటంతట అవే తొలగిపోతాయి. అలాంటి అవగాహనతో మానసికంగా అనాచ్ఛాదితం కావడమే నిజమైన ధ్యాన సాధన. జీవితం అంటే వర్తమాన క్షణాల దొంతర అని మనకు తెలుసు. అయితే గతం తాలూకు జ్ఞాపకాలు-గాయాలు, భవిష్యత్తు గురించిన ఊహలు-భయాలు నిరంతరం వర్తమాన క్షణంలోకి చొచ్చుకువస్తూ ఉంటాయి. అంటే గడచిపోయిన కాలం, ఇంకా రాని భవిష్యత్తు అనేవి అత్యంత విలువైన, తాజాది అయిన ప్రస్తుత క్షణాన్ని కలుషితం చేస్తున్నాయన్నమాట. ఈ అవగాహనతో... ప్రతిక్షణంపై నిత్యం ఎరుక (అవేర్‌నెస్‌తో) కలిగి ఉండడం కూడా ధ్యానంలో భాగమే.
స్వీయాన్వేషణ... సత్యాన్వేషణ
‘‘మనసు వేసే మోసపు వేషాలను కనిపెట్టడం, దాని తాలూకు కపటాన్ని కడిగి వేయడమే ధ్యానం’’ అంటారు ప్రఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ప్రతి విషయాన్నీ ప్రశ్నించి, లోతుగా ఆలోచించి, సత్యాసత్యాలను బేరీజు వేసి తేల్చుకొనే సమయం, ఓపిక మనలో చాలామందికి ఉండవు. అందుకే ఎవరో ఇతరులు చెప్పిన జవాబులను ఇట్టే నమ్మేసి సమాధానపడమంటూ మనసు మభ్యపెడుతుంది. ఈ మాయకు లొంగకుండా అప్రమత్తంగా ఉండడం, దేనినైనా సొంత అన్వేషణ, స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోవడం, తేల్చుకోవడం... ఇవన్నీ ధ్యానంలో భాగమే. నిజమైన ధ్యానం అంటే స్వీయాన్వేషణ... సత్యాన్వేషణ. తనను తాను తెలుసుకొనే ప్రయాణంలో భాగంగా మనసును నిశితంగా పరిశీలన చేయడమే నిజమైన ధ్యాన సాధన. వాహనం నడిపేవారి కళ్ళు, కళ్ళద్దాలు సరిగ్గా పని చేస్తేనే ప్రయాణం భద్రంగా సాగుతుంది. అలాగే జీవిత ప్రయాణం సవ్యంగా సాగాలంటే... స్పష్టంగా చూడగలిగే మనసు ద్వారానే కుదురుతుంది. నమ్మకాలు, గత జ్ఞానం తాలూకు దుమ్ము వదిలించుకోవడం ద్వారా తేటపడిన మనసు... ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతుంది. అంతర్గత సంఘర్షణలన్నిటినీ అంతం చేస్తుంది. అసత్యమైన వాటిని గుర్తించి, తొలగించుకొనే తీక్షణతను సంతరించుకుంటుంది. అలాంటి ధ్యానాత్మకమైన మనసే సత్యానికి ద్వారాలు తెరుస్తుంది.
- ఈదర రవికిరణ్