Female Rapido captain: ర్యాపిడో డ్రైవర్‌ను చూడగానే ఫుల్ ఖుష్.. ఊబెర్ క్యాబ్ క్యాన్సిల్ చేసిన మహిళ.. ఎందుకంటే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:40 PM
ర్యాపిడో రైడ్ బుక్ చేస్తే మహిళా డ్రైవర్ రావడంతో సంతోషపడ్డారు. అప్పటికే బుక్ చేసుకున్న ఊబెర్ క్యాబ్ రైడ్‌ను క్యాన్సల్ చేశారు. ఓ మహిళగా మహిళ బైక్ రైడర్‌తో కలిసి వెళ్లడం ఎంతో సంతోషంగా కనిపించిందంటూ ఆ కస్టమర్ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ర్యాపిడో బైక్‌తో పాటు ఊబెర్ క్యాబ్‌ను కూడా బుక్ చేసిన ఓ మహిళ ర్యాపిడో డ్రైవర్‌ను చూడగానే ఫుల్ ఖుష్ అయిపోయింది. ఆ వెంటనే ఊబెర్ క్యాబ్ క్యాన్సిల్ చేసింది. ర్యాపిడో డ్రైవర్‌తో ప్రయాణం ఎంత జాలీగా గడిచిందో చెబుతూ ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
స్మృతీ సాహూ అనే మహిళ లింక్డ్‌ఇన్‌లో పంచుకున్న పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్ చేశాక రైడ్ బుక్ చేసుకున్నట్టు ఆమె తెలిపింది. ర్యాపిడోతో పాటు ఊబెర్ క్యాబ్‌ను కూడా బుక్ చేసినట్టు తెలిసింది.
అయితే, ముందుగా వచ్చిన ర్యాపిడో డ్రైవర్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని ఆమె చెప్పింది. ఓ మహిళ ర్యాపిడో డ్రైవర్‌గా వచ్చినందుకు తనకు పట్టలేని సంతోషం కలిగిందని చెప్పింది. దీంతో, మరుక్షణమే తాను ఊబెర్ రైడ్ క్యాన్సిల్ చేశానని తెలిపింది.
Read Also: అణు రియాక్టర్ నిర్మించిన 12 ఏళ్ల బాలుడు.. గిన్నిస్ రికార్డు సొంతం
ఇక మహిళ క్యాప్టెన్‌తో బైక్ జర్నీ అద్భుతంగా ఉందని స్మృతి పేర్కొంది. ఆ డ్రైవర్ పేరు పూజా అని, ఆమె షెఫ్‌గా పనిచేస్తున్నప్పటికీ బైక్ రైడింగ్‌పై ఇష్టత కారణంగా ఇలా ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తున్నారని పేర్కొంది. తన ప్రయాణం సౌకర్యంగా ఉందో లేదో పలుమార్లు పూజా అడిగి తెలుసుకుందని స్మృతి తెలిపింది. ‘‘మేడమ్ మీరు కంఫర్టబుల్‌గానే కూర్చున్నారుగా? నేను మరీ స్పీడుగా ఏమీ వెళ్లట్లేదుగా? అని పలుమార్లు అడిగింది. ఏదో అడగాలని అడిగినట్టు కాకుండా ఆమెకు నిజంగానే నేను సౌకర్యంగా జర్నీ చేయాలని కోరుకుంది’’ అని స్మృతి కామెంట్ చేసింది. ‘‘ఆమె కూడా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కున్నట్టు ఆమె మాటల్ని బట్టి అర్థమైంది. చిన్న చిన్న సరదాలను కూడా ఆమె మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది’’ అని అన్నారు. పూజా బైక్‌పై 35 నిమిషాల జర్నీ అద్భుతంగా సాగిందని కూడా పేర్కొంది. ఆ జర్నీ డీటెయిల్స్ నెట్టింట కూడా పంచుకున్న స్మృతి.. పూజకు ఏదైనా నజరానా ఇవ్వాలని కూడా ర్యాపిడోను కోరింది.
Read Also: పైలట్లు లేని విమానంలో మమల్ని కూర్చోబెడతారా.. ఎయిర్ ఇండియాపై డేవిడ్ వార్నర్ ఆగ్రహం
ఈ కథనంపై నెట్టింట కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తాను కూడా క్యాబ్‌లు, బైక్‌లు బుక్ చేయాలంటే తెగ భయపడిపోతానని ఓ మహిళ కామెంట్ చేసింది. కానీ, స్మృతి అనుభవం గురించి చదివాక తనకు ఎంతో సంతోషం కలిగిందని వెల్లడించింది. కర్ణాటకలో మహిళా క్యాపెన్ల బైక్ రైడ్ సర్వీసును పింక్ బైక్ పేరిట త్వరలో ప్రారంభిస్తామని గతనెలలో ర్యాపిడో వ్యవస్థాపకులు పవన్ గుంటుపల్లి పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో, 25 వేల మంది మహిళలకు ఉపాధి దొరుకుతుందని అన్నారు.