Share News

Lifestyle: మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చేసుకుంటే లైఫ్‌లాంగ్ హాయిగా గడిపేయొచ్చు

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:47 PM

నేటి ఆధునిక కాలంలో చోటు చేసుకుంటున్న మార్పులు, మారుతున్న జీవిన శైలి కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే జీవితాంతం హాయిగా గడిపేయవచ్చు.

Lifestyle: మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చేసుకుంటే లైఫ్‌లాంగ్ హాయిగా గడిపేయొచ్చు
Lifestyle

టెక్నాలజీ పెరిగింది.. దాంతో ఉద్యోగ, ఉపాధి మార్గాలతో పాటుగా మన జీవన విధానంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతికత పెరగడం వల్ల ఎన్ని లాభాలు సమకూరుతున్నాయో.. అదే స్థాయిలో నష్టాలు కూడా వాటిల్లుతున్నాయి. ఆధునిక సాంకేతికత.. మన శారీరక, మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. భారీ నష్టం వాటిల్లిన తర్వాత గానీ సమస్యను గుర్తించలేకపోతున్నాం. మరి ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి.. హ్యాపీ లైఫ్ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే వివరాలు మీ కోసం..


పెరుగుతున్న సాంకేతికత, లైఫ్‌స్టైల్‌లో మార్పులు, పట్టణీకరణ వంటివి ఆధునిక జీవనశైలిలోని ముఖ్యమైన అంశాలు. ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతేకాక సామాజిక సంబంధాలను కూడా తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి. మరి వీటిని పరిష్కరించుకుని హ్యాపీ లైఫ్ గడపాలంటే ఈ కింద చెప్పిన టిప్స్ ఫాలో అయితే సరి.


30 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి

ఆధునిక జీవనశైలిలో ముఖ్యమైన సమస్య.. శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం. ఇప్పుడు సమాజంలో ఉన్న ఉద్యోగాల్లో నూటికి 95 శాతం డెస్క్ జాబ్స్.. అవి కూడా ఎక్కువగా ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ చేసేవే ఉంటున్నాయి. వీటివల్ల.. ఊభకాయం, మధుమేహం, గుండె సంబంధిత జబ్బులు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం.. ప్రతి ఒక్కరు.. రోజుకు కనీసం 30 నిమిషాలైనా.. తేలికైన వ్యాయామం చేయాలి. దీని వల్ల.. పైన చెప్పిన సమస్యలను నివారించే అవకాశం ఉంది. అలానే నడక, సైక్లింగ్, యోగా వంటి వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. వ్యాయామంతో పాటుగా.. సమతుల్య ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దు. రోజు తినే వారి ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలానే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి అంత మంచిది అంటున్నారు నిపుణులు.


కంటి నిండా నిద్ర తప్పనిసరి..

వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటుగా.. కంటి నిండా నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. అయితే నేటి కాలంలో సాంకేతికత వినియోగం పెరగడం, సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌ల వాడకం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు 6 గంటలకు పైగా స్క్రీన్ చూసే వారిలో 30 శాతం మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని నివారించడానికి రాత్రి పడుకోవడానికి కొన్ని గంటల ముందే ఫోన్ వాడకాన్ని నిలిపివేయాలి. దాంతో పాటు వారానికి ఒక రోజు డిజిటల్ డిటాక్స్ చేయడం ముఖ్యం. సరైన నిద్ర, స్క్రీన్ వాడకం తగ్గించడం కోసం మెడిటేషన్, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవడం సహాయకరంగా ఉంటాయంటున్నారు నిపుణులు.


పెరుగుతున్న సాంకేతికత, జీవనశైలిలో మార్పులు మన మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటుగా సామాజిక సంబంధాలను కూడా క్షీణింపచేస్తున్నాయి. ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, ఉద్యోగాల పేరుతో కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండాల్సి రావడం వల్ల వారితో గడిపే సమయం తగ్గుతోంది. ఇది ఒంటరితనం, డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఈ సమస్య నివారణ కోసం వారానికి కనీసం ఒకసారి కుటుంబం, స్నేహితులతో సమయం గడపాలి. అలానే వారానికి కనీసం ఒక్క రోజైనా ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు లేకుండా.. మీకోసం నాణ్యమైన సమయాన్ని కేటాయించుకోవడం ముఖ్యం.


జీవనశైలి, సాంకేతికతతో పాటు.. పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. దీన్ని పరిష్కరించడం కోసం ఇంట్లో గాలిని శుద్ధి చేసే మొక్కలను పెంచాలి. అవసరమైతే మాస్క్‌లు ధరించాలి. వీటితో పాటుగా కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో పాల్గొనడం మర్చిపోవద్దు.


మొత్తంగా చూసుకుంటే ఆధునిక జీవనశైలి.. మనకు సౌలభ్యాలను అందిస్తున్నప్పటికీ, శారీరక,మానసిక ఆరోగ్యాలను ప్రభావితం చేస్తుంది. వీటిని కాపాడుకోవడానికి సమతుల్య జీవనం అవసరం. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు అంటున్నారు నిపుణులు.

Updated Date - Mar 23 , 2025 | 01:54 PM