Share News

టైటిల్‌ నిలబెట్టుకోవాలని.. రహానె సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:08 AM

డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. 2012, 2014లో గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్సీలో ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గిన కోల్‌కతా.. దశాబ్దం తర్వాత 2024లో...

టైటిల్‌ నిలబెట్టుకోవాలని.. రహానె సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌

రహానె సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌

డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. 2012, 2014లో గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్సీలో ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గిన కోల్‌కతా.. దశాబ్దం తర్వాత 2024లో మళ్లీ విజేతగా నిలిచింది. గత సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకొంది. మెంటార్‌గా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన గంభీర్‌ టీమిండియా కోచ్‌గా వెళ్లాడు. అయితే శ్రేయాస్‌ అయ్యర్‌ను వదిలేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, రింకూ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌, హర్షిత్‌ రాణా, రమణ్‌దీప్‌ సింగ్‌తో కోర్‌ టీమ్‌ను రిటైన్‌ చేసుకోవడం చూస్తే జట్టు విషయంలో మేనేజ్‌మెంట్‌ స్పష్టతతోనే ఉన్నట్టు అవగతమవుతోంది. రూ. 23.75 కోట్లకు ఆల్‌రౌండర్‌ వెంకటేష్‌ అయ్యర్‌ను కొనుగోలు చేయడంతో అతడికే జట్టు పగ్గాలు అప్పగిస్తారని భావించారు. కానీ, అనుభవజ్ఞుడైన అజింక్యా రహానెను వేలంలో కనీస ధరకే దక్కించుకొన్న కోల్‌కతా.. అతడికే సారథ్యం అప్పగించింది. మెంటార్‌గా అవతారం ఎత్తిన డ్వేన్‌ బ్రావో ఎలా నడిపిస్తాడో చూడాలి. ఓవరాల్‌గా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మెరుగైన ఆటగాళ్లతో సమతుల్యంగా కనిపిస్తోంది.


డికాక్‌, గుర్బాజ్‌, రింకూతో బ్యాటింగ్‌ బలంగానే ఉంది. అయితే, టీమ్‌ ఎక్కువగా నరైన్‌, రస్సెల్‌పైనే ఆధారపడి ఉందనేది వాస్తవం. వీళ్లిద్దరూ జట్టుకు బలం.. బలహీనతగా మారారు. రస్సెల్‌ ఫిట్‌నెస్‌ ఎప్పుడూ ఆందోళన కలిగిస్తోంది. మిస్టరీ స్పిన్నర్‌గా, ఓపెనర్‌గా నరైన్‌ ఎప్పుడూ అంచనాలను తలకిందులు చేస్తుంటాడు. ఒకవేళ వీరిద్దరూ విఫలమైనా లేక గాయాలపాలైతే భర్తీ చేయగల బ్యాకప్‌ ప్లేయర్లు లేకపోవడం జట్టును ఆందోళనకు గురి చేసే అంశం. వేలంలో దక్కించుకొన్న పేసర్‌ నోకియా కూడా తరచూ ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

జట్టు

బ్యాటర్లు: అజింక్యా రహానె (కెప్టెన్‌), రింకూ సింగ్‌, రఘువంశీ, రోవ్‌మన్‌ పావెల్‌, మనీష్‌ పాండే;

వికెట్‌ కీపర్లు: క్వింటన్‌ డికాక్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, లువ్‌నిత్‌ సిసోడియా; ఆల్‌ రౌండర్లు: వెంకటేష్‌ అయ్యర్‌, అనుకుల్‌ రాయ్‌, మొయిన్‌ అలీ, రమణ్‌దీప్‌ సింగ్‌, రస్సెల్‌;

బౌలర్లు: నోకియా, వైభవ్‌ అరోరా, మయాంక్‌ మార్కండే, స్పెన్సర్స్‌ జాన్సన్‌, హర్షిత్‌ రాణా, నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, చేతన్‌ సకారియా.

Updated Date - Mar 20 , 2025 | 04:08 AM