Share News

రైజర్స్‌కు ఝలక్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:53 AM

ఐపీఎల్‌లోనే భీకర బ్యాటింగ్‌ లైనప్‌.. పైగా గతేడాది ఇదే లఖ్‌నవూ జట్టుపై 9.4 ఓవర్లలో 167 రన్స్‌ బాదిన సన్‌రైజర్స్‌ వామ్మో అనిపించింది. దీంతో ఇప్పుడు 300 స్కోరు ఖాయమేనా? అనే విశ్లేషణలు కూడా వినిపించాయి. కానీ...

రైజర్స్‌కు ఝలక్‌

ఐపీఎల్‌లో నేడు

వేదిక చెన్నై రా.7.30

చెన్నైX బెంగళూరు

లఖ్‌నవూ ‘సూపర్‌’ విజయం

  • చెలరేగిన పూరన్‌

  • శార్దూల్‌కు నాలుగు వికెట్లు

ఐపీఎల్‌లోనే భీకర బ్యాటింగ్‌ లైనప్‌.. పైగా గతేడాది ఇదే లఖ్‌నవూ జట్టుపై 9.4 ఓవర్లలో 167 రన్స్‌ బాదిన సన్‌రైజర్స్‌ వామ్మో అనిపించింది. దీంతో ఇప్పుడు 300 స్కోరు ఖాయమేనా? అనే విశ్లేషణలు కూడా వినిపించాయి. కానీ ఈసారి ఉప్పల్‌లో సీన్‌ మారింది. టాస్‌ గెలిచిన పంత్‌ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించడమే కాదు.. వారెంత కొట్టినా తాము ఛేదించగలమంటూ సవాల్‌ విసిరాడు. పేసర్‌ శార్దూల్‌ (4/34) ఆరంభంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లకు ముకుతాడు వేయగా, వీర బాదుడు మీకే కాదు.. మాకూ వచ్చంటూ నికోలస్‌ పూరన్‌ 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీతో ఓటమిని కళ్లముందుంచాడు. ఓపెనర్‌ మార్ష్‌ కూడా సహకరించడంతో లఖ్‌నవూ గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది.


హైదరాబాద్‌: ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు సొంత మైదానంలో షాక్‌ తగిలింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 286 రన్స్‌ చేసిన జోష్‌లో ఉన్న ఆ జట్టును లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ నేలకు దించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో కనబర్చిన లఖ్‌నవూ 5 వికెట్ల తేడాతో గెలిచింది. పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ 4 వికెట్లతో అదరగొట్టగా, బ్యాటింగ్‌లో నికోలస్‌ పూరన్‌ (26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముందుగా సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. హెడ్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47), అనికేత్‌ (13 బంతుల్లో 5 సిక్సర్లతో 36), నితీశ్‌ (28 బంతుల్లో 2 ఫోర్లతో 32), క్లాసెన్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26) రాణించారు. ఛేదనలో లఖ్‌నవూ 16.1 ఓవర్లలోనే 5 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. మార్ష్‌ (31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 52), సమద్‌ (8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 22 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. కమిన్స్‌కు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా శార్దూల్‌ ఠాకూర్‌ నిలిచాడు.


పూరన్‌ పూనకం: ఛేదనలో రైజర్స్‌ బౌలర్లను పూరన్‌ ఆడేసుకున్నాడు. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (1) మరోసారి విఫలమైనా.. మరో ఓపెనర్‌ మార్ష్‌తో కలిసి పూరన్‌ స్కోరును రాకెట్‌ వేగంతో ముందుకు తీసుకెళ్లాడు. రెండో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన పూరన్‌ ప్రతీ బంతిని బాదడమే లక్ష్యంగా చెలరేగాడు. మూడో ఓవర్‌లో 4,6,6తో 17 రన్స్‌ రాబట్టగా.. తర్వాతి ఓవర్‌లో మార్ష్‌ రెండు సిక్సర్లతో 18 రన్స్‌ అందించాడు. అభిషేక్‌ ఓవర్‌లో పూరన్‌ మరో రెండు సిక్సర్లతో లఖ్‌నవూ పవర్‌ప్లేలో 77/1 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. పూరన్‌ తన జోరును కొనసాగిస్తూ ఏడో ఓవర్‌లో 6,6,4తో 18 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తాజా సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్‌. అయితే పూరన్‌ తుఫాన్‌ ఆటకు కమిన్స్‌ 9వ ఓవర్‌లో ఎల్బీతో బ్రేక్‌ వేశాడు. దీంతో రెండో వికెట్‌కు 43 బంతుల్లో 116 పరుగులు మెరుపు భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మార్ష్‌ రెండు వరుస ఫోర్లతో 29 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసి కమిన్స్‌కే చిక్కాడు. స్వల్ప వ్యవధిలో బదోని (6), పంత్‌ (15) అవుటైనా అప్పటికే జట్టు విజయం ఖాయమైంది. అబ్దుల్‌ సమద్‌ 15వ ఓవర్‌లో 4,6.. 16వ ఓవర్‌లో 6,4తో ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంతో మరో 23 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.


కట్టడి చేశారు: టాస్‌ గెలిచిన లఖ్‌నవూ కెప్టెన్‌ పంత్‌.. రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో ఇక పరుగుల వరదే అనే భావనలో స్టేడియం హోరెత్తిపోయింది. అయితే పంత్‌ నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయలేదు. ఆరంభంలో పేసర్లు శార్దూల్‌, మధ్య ఓవర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ విశేషంగా రాణించి రైజర్స్‌ను కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌ చివరి 15 బంతుల్లోనైతే లఖ్‌నవూ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. హెడ్‌, అనికేత్‌ బాదుడు రైజర్స్‌ స్కోరులో కీలకంగా నిలిచింది. మూడో ఓవర్‌లో పేసర్‌ శార్దూల్‌ వరుస బంతుల్లో ఓపెనర్‌ అభిషేక్‌ (6), గత మ్యాచ్‌ సెంచరీ హీరో ఇషాన్‌ను గోల్డెన్‌ డకౌట్‌ చేసి రైజర్స్‌కు ఝలకిచ్చాడు. అయినా మరో ఓపెనర్‌ హెడ్‌ మాత్రం దూకుడు ఆపలేదు. తర్వాతి ఓవర్‌లోనే 6,6,4తో 18 రన్స్‌ రాబట్టాడు. ఆరో ఓవర్‌ తొలి బంతికి హెడ్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పూరన్‌ వదిలేయగా.. ఐదో బంతికి క్లిష్టమైన రిటర్న్‌ క్యాచ్‌ను స్పిన్నర్‌ బిష్ణోయ్‌ అందుకోలేకపోయాడు. పవర్‌ప్లేలో రైజర్స్‌ 62/2తో నిలిచింది. ఇక హెడ్‌ మరింత ప్రమాదకరంగా మారకముందే 8వ ఓవర్‌లో ఫుల్లర్‌ లెంగ్త్‌ బాల్‌తో పేసర్‌ ప్రిన్స్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికే మూడో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. అనంతరం పరుగులు కూడా నెమ్మదించగా, క్రీజులో ఉన్న నితీశ్‌ ఆచితూచి ఆడాడు. అలాగే 11వ ఓవర్‌లో అతను అంపైర్‌ కాల్‌తో ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు. స్పిన్నర్‌ దిగ్వేష్‌ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన క్లాసెన్‌ అనూహ్యంగా రనౌటయ్యాడు. 12వ ఓవర్‌లో నితీశ్‌ రిటర్న్‌ క్యాచ్‌ను అందుకునే క్రమంలో ప్రిన్స్‌ చేతికి తగిలిన బంతి నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌లో వికెట్లను గిరాటేయడంతో క్లాసెన్‌ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. అటు ఒత్తిడికి లోనైన నితీశ్‌ భారీ షాట్‌కు వెళ్లి బిష్ణోయ్‌ ఓవర్‌లో బౌల్డయ్యాడు. అయితే ఎవరి అంచనాలో లేని అనికేత్‌ మాత్రం 15, 16వ ఓవర్లలో రెండు వరుస సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. అదే జోరులో మరో షాట్‌కు వెళ్లి మిల్లర్‌కు చిక్కాడు. ఆ వెంటనే అభినవ్‌ (2)ను శార్దూల్‌ అవుట్‌ చేశాడు. ఇక కమిన్స్‌ (4 బంతుల్లో 3 సిక్సర్లతో 18) తానెదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచి అదుర్స్‌ అనిపించినా నాలుగో బంతికి వెనుదిరిగాడు. ఇక 19వ ఓవర్‌లో శార్దూల్‌ మూడు పరుగులే ఇచ్చి షమి (1)ని వెనక్కి పంపి 4 వికెట్లను పూర్తి చేసుకోగా, ఆఖరి ఓవర్‌లో అవేశ్‌ ఏడు పరుగులే ఇవ్వడంతో రైజర్స్‌ స్కోరు 200లోపు ముగిసింది.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: హెడ్‌ (బి) ప్రిన్స్‌ 47, అభిషేక్‌ (సి) పూరన్‌ (బి) శార్దూల్‌ 6, ఇషాన్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 0, నితీశ్‌కుమార్‌ (బి) బిష్ణోయ్‌ 32, క్లాసెన్‌ (రనౌట్‌) 26, అనికేత్‌ (సి) మిల్లర్‌ (బి) రాఠి 36, అభినవ్‌ (సి) సమద్‌ (బి) శార్దూల్‌ 2, కమిన్స్‌ (సి) రాఠి (బి) అవేశ్‌ 18, హర్షల్‌ (నాటౌట్‌) 12, షమి (సి) బదోని (బి) శార్దూల్‌ 1, సిమర్జీత్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 190/9; వికెట్ల పతనం: 1-15, 2-15, 3-76, 4-110, 5-128, 6-156, 7-156, 8-176, 9-181; బౌలింగ్‌: శార్దూల్‌ 4-0-34-4, అవేశ్‌ 4-0-45-1, దిగ్వేష్‌ రాఠి 4-0-40-1, రవి బిష్ణోయ్‌ 4-0-42-1, ప్రిన్స్‌ 4-0-29-1.

లఖ్‌నవూ: మిచెల్‌ మార్ష్‌ (సి) నితీశ్‌ (బి) కమిన్స్‌ 52, మార్‌క్రమ్‌ (సి) కమిన్స్‌ (బి) షమి 1, నికోలస్‌ పూరన్‌ (ఎల్బీ) కమిన్స్‌ 70, రిషభ్‌ పంత్‌ (సి) షమి (బి) హర్షల్‌ 15, ఆయుష్‌ బదోని (సి) హర్షల్‌ (బి) జంపా 6, డేవిడ్‌ మిల్లర్‌ (నాటౌట్‌) 13, అబ్దుల్‌ సమద్‌ (నాటౌట్‌) 22, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 16.1 ఓవర్లలో 193/5; వికెట్ల పతనం: 1-4, 2-120, 3-138, 4-154, 5-164; బౌలింగ్‌: అభిషేక్‌ 2-0-20-0, షమి 3-0-37-1, సిమర్జీత్‌ సింగ్‌ 2-0-28-0, కమిన్స్‌ 3-0-29-2, ఆడమ్‌ జంపా 4-0-46-1, హర్షల్‌ పటేల్‌ 2-0-28-1, ఇషాన్‌ కిషన్‌ 0.1-0-4-0.

1

ఐపీఎల్‌లో ఇంత వేగంగా (7.3 ఓవర్లలో) వంద పరుగులు చేయడం లఖ్‌నవూకు ఇదే తొలిసారి.

1

20 బంతుల్లోపే ఎక్కువ (4) ఫిఫ్టీలు సాధించిన ఐపీఎల్‌ బ్యాటర్‌గా పూరన్‌.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

బెంగళూరు 1 1 0 0 2 2.137

లఖ్‌నవూ 2 1 1 0 2 0.963

పంజాబ్‌ 1 1 0 0 2 0.550

చెన్నై 1 1 0 0 2 0.493

ఢిల్లీ 1 1 0 0 2 0.371

హైదరాబాద్‌ 2 1 1 0 2 -0.128

కోల్‌కతా 2 1 1 0 2 -0.308

ముంబై 1 0 1 0 0 -0.493

గుజరాత్‌ 1 0 1 0 0 -0.550

రాజస్థాన్‌ 2 0 2 0 0 -1.882

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవి కూడా చదవండి..

Kavya Maran: అయ్యో.. వావ్.. మ్యాచ్ సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..

Riyan Parag: ఆ కుర్రాడికి రూ.10 వేలు ఇచ్చాడా.. రియాన్ పరాగ్ కాళ్లు మొక్కడంపై నెటిజన్లు కామెంట్లు ఏంటంటే

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2025 | 02:53 AM