Share News

బెదిరింపులు ఎవరివి.. ఒత్తిళ్లు ఎవరివి..

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:43 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం తమను బెదిరిస్తోందని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) యాజమాన్యం ఆరోపించడం...

బెదిరింపులు ఎవరివి.. ఒత్తిళ్లు ఎవరివి..

  • సన్‌రైజర్స్‌, హెచ్‌సీఏ మధ్య ఈ-మొయిల్స్‌ వివాదం

  • పాసుల కోసం హెచ్‌సీఏ బ్లాక్‌మెయిల్‌ చేస్తోందన్న రైజర్స్‌

  • ఎస్‌ఆర్‌హెచ్‌ అభియోగాలను తోసిపుచ్చిన హెచ్‌సీఏ

  • ఒక బాక్సులో 50 టిక్కెట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్న

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం తమను బెదిరిస్తోందని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) యాజమాన్యం ఆరోపించడం దుమారం రేపుతోంది. హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యుల తీరు మారకపోతే తాము హైదరాబాద్‌ నుంచి వేదిక తరలిస్తామని హెచ్‌సీఏలోని ప్రధాన అధికారికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ-మెయిల్‌ ద్వారా హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే తమకు ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి ఎలాంటి మొయిల్‌ రాలేదని హెచ్‌సీఏ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ అభియోగాలను కూడా తోసిపుచ్చింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైందన్న దానిపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.


కార్పొరేట్‌ బాక్స్‌ సామర్థ్యం ఎంత?

ఉప్పల్‌ స్టేడియంలో మొత్తం కార్పొరేట్‌ బాక్సుల సంఖ్య 58. ఇందులో ఒక్కో బాక్సులో అధికారికంగా 20 టిక్కెట్లు జారీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో అనధికారికంగా మరో 5 నుంచి 10 టిక్కెట్లు కూడా ముద్రిస్తారని సమాచారం. ఒప్పందం ప్రకారం స్టేడియం మొత్తం సీటింగ్‌ సామర్థ్యంలో 10 శాతం (3,900) కాంప్లిమెంటరీ పాసులను హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఇవ్వాలి. ఇందులో నుంచి హెచ్‌సీఏ తమ క్లబ్‌లకు 2,832 టిక్కెట్లు ఇస్తుంది. మిగిలినవి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, బందోబస్తు నిర్వహించే పోలీసులకు, సీఎంఓ, మంత్రులు, రాజకీయ ప్రముఖులకు హెచ్‌సీఏ ఇస్తుందని సమాచారం. భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు స్టేడియంలోని మొత్తం టిక్కెట్లు హెచ్‌సీఏ ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి కాంప్లిమెంటరీ పాసుల పంపకాలు సాఫీగానే జరుగు తాయి. ఐపీఎల్‌కొచ్చేసరికి స్టేడియాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌కు అద్దెకు ఇస్తుంది కాబట్టి ఏర్పాట్లు మొదలు టిక్కెట్ల వ్యవహారం మొత్తం ఆ జట్టు యాజమాన్యం చేతిలోనే ఉంటుంది. అయితే, పదేళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఉత్పన్నమవడానికి కారణం ఎఫ్‌12-ఎ బాక్సు టిక్కెట్ల వద్దే మొదలైందని తెలుస్తోంది.


వివాదానికి కేంద్ర బిందువు ఎఫ్‌12-ఎ!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. స్టేడియం దక్షిణ భాగంలోని మొదటి అంతస్తులో ఉన్న ఎఫ్‌12-ఎ బాక్సులో ఎస్‌ఆర్‌హెచ్‌ చాలాకాలంగా 50 టిక్కెట్లు (కాంప్లిమెంటరీ పాసుల) హెచ్‌సీఏకు ఇస్తోంది. ఒక బాక్సు సామర్థ్యం 20 టిక్కెట్లే కాబట్టి మహా అయితే మరో 10 కలిపి ఎఫ్‌12-ఏలో 30 టిక్కెట్లు ఇవ్వాలని, మిగిలిన 20 టిక్కెట్లు వేరే బాక్సుల్లో సర్దుబాటు చేయాల్సిందిగా హెచ్‌సీఏ సభ్యులు సీజన్‌ ఆరంభానికి ముందే ఎస్‌ఆర్‌హెచ్‌ను కోరారు. దానికి రైజర్స్‌ అంగీకరించింది. అయితే, ఈనెల 23న రాజస్థాన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు సుమారు 15 బాక్సులు ఖాళీగా ఉన్నా ఎస్‌ఆర్‌హెచ్‌ మళ్లీ ఎఫ్‌12-ఏ బాక్సులో 50 టిక్కెట్లు కేటాయించడం హెచ్‌సీఏకు రుచించలేదు. దీంతో ఇదే విషయమై, ఈనెల 27న లఖ్‌నవూతో మ్యాచ్‌ సందర్భంగా హెచ్‌సీఏ నిరసన తెలపడంతో తదుపరి మ్యాచ్‌కు సమస్యను పరిష్కరిస్తామని ఎస్‌ఆర్‌హెచ్‌ హామీ ఇచ్చింది.


రహస్యంగా ‘కాంప్లిమెంటరీ’ల లెక్క..

అసలు హెచ్‌సీఏకి ఇచ్చేవి కాకుండా ఎస్‌ఆర్‌హెచ్‌ ఎన్ని కాంప్లిమెంటరీ పాసులు జారీ చేస్తోంది.. ఎన్ని టిక్కెట్లను అమ్మకానికి పెడుతుందనే దానికి లెక్కా పత్రం లేకపోవడం చర్చనీయాంశమైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో తప్ప టిక్కెట్ల విక్రయం గురించి ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మ్యాచ్‌ టిక్కెట్ల ధరలను కూడా డిమాండ్‌ను బట్టి ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో విధంగా నిర్ణయిస్తున్నారని, టిక్కెట్‌ ఽరేట్‌ల పట్ల ఆఖరికి ఎస్‌ఆర్‌హెచ్‌ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొత్త యాప్‌లో టిక్కెట్లు విక్రయించడం, వాటి అమ్మకాలపై సమాచారం ఇవ్వకపోవడంపై కూడా అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇకపోతే స్టేడియంలోని కొన్ని స్టాండ్లలో టిక్కెట్లు కొనుగోలు చేసి వెళ్లిన వారికి సీట్లు కూడా దొరకడం లేదని, సామర్థ్యానికి మించి టిక్కెట్లు విక్రయిస్తున్నారని, సదుపాయాలు కూడా బాగా లేవన్న ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా హెచ్‌సీఏ-ఎ్‌సఆర్‌హెచ్‌ మధ్య మొదలైన కాంప్లిమెంటరీ పాసుల వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.


ఇదీ.. సన్‌రైజర్స్‌ అభియోగం

అదనంగా కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వాలని హెచ్‌సీఏ ఒత్తిడి చేస్తున్నదని ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రధాన అభియోగం. గత మ్యాచ్‌కు ముందు స్టేడియంలోని ఎఫ్‌-3 బాక్సుకు హెచ్‌సీఏ తాళాలు వేసిందని, ఇలాంటి ధోరణిలో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించలేమని, హెచ్‌సీఏకు హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలని హెచ్‌సీఏ అధికారికి పంపిన ఈ-మెయిల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ, ఐపీఎల్‌ పాలకమండలి జోక్యం చేసుకోవాలని కోరనున్నట్టు కూడా ఆ మెయిల్‌లో పేర్కొందట.

ఇవి కూడా చదవండి..

IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా

IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్

IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 08:57 AM