సమయ పాలన సరే.. సేవలు అధ్వానం..
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:54 AM
గ్రామీణ పేదలకు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు ఇంకా అందడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 ఉప కేంద్రాలు, రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలు అందించే ఏర్పాట్లు ఉన్నాయి. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత ఇబ్బందికరంగా మారింది.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల/నెట్‌వర్క్)
గ్రామీణ పేదలకు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు ఇంకా అందడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 ఉప కేంద్రాలు, రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలు అందించే ఏర్పాట్లు ఉన్నాయి. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత ఇబ్బందికరంగా మారింది. ఉదయంనుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు కొంతమేరకు అందుతున్నా సాయంత్రం తరువాత నర్సింగ్ సిబ్బంది మాత్రమే సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అందని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, వేములవాడలోని ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సిందే. మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వారి వైద్యం వికటించి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజితలు నిత్యం తనిఖీలు చేపడుతుండడంతో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారు. సేవలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో వైద్యులు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వస్తుండడం కూడా పూర్తిస్థాయిలో సేవలు అందని పరిస్థితి ఉంది. వైద్యులు, సిబ్బందికి ఆధార్ అటెండెన్స్ పద్ధతిని తీసుకవస్తున్నారు. ఇప్పటికే మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ పక్రియ ఉండగా, తాజాగా ఫేస్ రికగ్నిషన్‌ను తీసుకవచ్చే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆంధ్రజ్యోతి విజిట్’లో పలు అంశాలు తేటతెల్లమయ్యాయి.
ఫ వేములవాడ ఆసుపత్రిలో సిబ్బంది కొరత
వేములవాడ టౌన్ : వేములవాడ ఏరియా ఆసుపత్రికి నిత్యం 500మంది రోగులకు పైగా వస్తున్నారు. వంద పడకల ఆసుపత్రిగా మారినప్పటికి సిబ్బందిని మాత్రం పెంచలేదు. గత ఫిబ్రవరిలోని 28 రోజుల్లో 8 వేల మంది రోగులు ఆయా సమస్యలతో ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది సరిపడా లేరు. మెను ప్రకారం భోజనం అందిస్తున్నారని రోగులు తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి వస్తున్న రోగుల దృష్ట్యా 50 మంది సిస్టర్స్ అవసరం కాగా, 18మంది ఉన్నారు. 25మంది డాక్టర్‌లు అందుబాటులో ఉండాల్సి ఉండగా, 12 మంది డాక్టర్‌లు మాత్రమే ఉన్నారు. వీరిలో 4 రెగ్యులర్ డాక్టర్‌లు, ఇద్దరు కాంట్రాక్ట్, ముగ్గురు సివిల్ సర్జన్‌లు, ముగ్గురు డిప్యూటేషన్‌పై వస్తున్నారు. ఆసుపత్రిలో రాత్రి సమయంలో సెల్‌ఫోన్‌ల చోరీలు జరుగుతున్నాయని, ఒక ఔట్‌పోస్ట్ పోలీస్ ఉద్యోగిని నియమించాలని రోగులు కోరుతున్నారు. కాగా, నెలలు నిండక ముందు పుట్టిన చిన్నారులకు అవసరమైన సామగ్రి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ మూడు సంవత్సరాలుగా నిరుపయోగంగా మారింది. దీంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విషయంపై ఆసుపత్రి సూపరిండెంట్‌ను వివరణ కోరగా సిటీ స్కాన్ నిరుపయోగంగా ఉందని, ప్రతి సంవత్సరం సీటీ స్కాన్ మెయింటనెన్స్ కోసం రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం అంత ఖర్చును భరించడానికి సిద్ధంగా లేదని, దీంతో నిరుపయోగంగా మారిందని తెలిపారు.
అరకొర వసతులు.. అంతంత మాత్రంగా వైద్యసేవలు
ఇల్లంతకుంట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర వసతులు ఉన్నాయి. వైద్యసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఇల్లంతకుంటలో 50పడకల ఆసుపత్రి మంజూరు కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్దలింగాపూర్ గ్రామానికి తరలిపోయింది. భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో పల్లె దవాఖానాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొనసాగుతోంది. ఇరుకైన భవనంలో ఆసుపత్రికి వచ్చిన వారు కూర్చునే వీలుకూడా లేదు. మహిళా ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నా వాష్‌రూంలకు నీరు రావడం లేదు. గతంలో 90మంది ఓపీ వస్తుండగా ప్రస్తుతం సగానికి పడిపోయింది. అన్ని విధాలైన మందులు అందుబాటులో ఉన్నాయి. పల్లె దవాఖానాలోనే ఆయుష్ వైద్యసేవలు ఉండగా వారికి ఒక గదిని మాత్రమే కేటాయించారు. వైద్యాధికారి, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టు మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా సిబ్బంది పెద్దలింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారని సిబ్బంది తెలిపారు.
రక్త పరీక్షలకు ఇబ్బందులే..
తంగళ్లపల్లి : తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త నమూనా పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. పరీక్షలు చేసే యంత్రాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మరమ్మతులకు నోచుకోకపోవడంతో కేవలం కొని పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. రెండునెలల క్రితం మందుల కొరత ఉండేదని ప్రస్తుతం పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పాముకాటు, కుక్కకాటు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. నిత్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దాదాపు 50 మంది రోగులు వస్తుండగా సోమవారం 39 మంది రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహించే ‘ఆరోగ్య మహిళ’లో 80 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారని, మెరుగైన వైద్యంతో పాటు మందులు కూడా అందిస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు.
అద్దె భవనంలో ఆరోగ్య కేంద్రం..
వీర్నపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. మారుమూల గిరిజన మండలంలో ఆరోగ్యకేంద్రాన్ని హడావుడిగా ఏర్పాటుచేసినా ల్యాబ్ టెక్నిషియన్, స్టాఫ్ నర్సులను కేటాయించలేదు. ఉన్న మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, జూనియర్ అసిస్టెంట్‌లు డిప్యూటేషన్‌పై సేవలందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రానికి పూర్తిస్థాయి అనుమతులు లేకపోవడంతో మందుల కొరత ఏర్పడుతోంది. మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అద్దెభవనంలో ఏర్పాటు చేయడంతో ఇరుకు గదులతో రోగులకు ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్‌సీలో 12 గంటలు మాత్రమే సేవలందించడంతో రాత్రిపూట ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రులే దిక్కవుతున్నయి. పాలకులు స్పందించి 24 గంటల పీహెచ్‌సీని అందుబాటులోకి తేవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
వైద్యుల కొరత.. సమస్యల మోత..
ఎలారెడ్డిపేట: మండల కేంద్రంతో పాటు రాచర్లబొప్పాపూర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత వేధిస్తోంది. నిత్యం సీహెచ్‌సీలో 120 మంది, పీహెచ్‌పీలో 40 మంది వస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో 13 మంది వైద్య నిపుణులకు ఒకరు ఎండీ ఫిజిషియన్, పిల్లల వైద్యుడు, ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు సిరిసిల్ల ఆసుపత్రి నుంచి డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో వైద్య నిపుణులు లేకపోవడం వల్ల గర్భిణీలు, ప్రసవలు, శస్త్ర చికిత్స సేవలు అందడం లేవు. సీహెచ్‌సీలో ఆరు పడకలతోనే వెల్లదీయాల్సి వస్తోంది. 32 పడకల ఆసుపత్రిగా పదోన్నతి పొందినా వసతి కరవైంది. రక్త, మూత్ర పరీక్షలు చేసే యంత్రం ఆరు నెలలుగా పని చేయకపోవడం వల్ల కేవలం కొన్ని పరీక్షలు మాత్రమే సీహెచ్‌సీలో నిర్వహిస్తున్నారు. రోగుల వద్ద నుంచి నమూనాలను సేకరించి టీహబ్‌కు పంపిస్తున్నారు. రిపోర్టు వచ్చేంత వరకు రోగులు రెండు రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది. తిరిగి కేంద్రానికి చేరుకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. 32 పడకలను వేసేందుకు రేకుల షెడ్డులో తాత్కాలికంగా ఏర్పాటు చేసినా పూర్తిస్థాయి వసతులు లేక పడకలను మూలకు పడేశారు. జనరేటర్ అందుబాటులో ఉన్నా వినియోగంలోకి రాక విద్యుత్తు సరఫరా నిలిచిపోతే రాత్రివేళలో రోగులు, సిబ్బంది చీకట్లోనే గడపాల్సి వస్తోంది. పీహెచ్‌సీలో విధులు నిర్వహించే ఫార్మాసిస్టు, ల్యాబ్ టేక్నిషన్ సీహెచ్‌సీలో కొనసాగుతున్నారు. పీహెచ్‌సీని రాచర్లబొప్పాపూర్‌లోని పల్లె దవాఖానాలో కొనసాగిస్తున్నారు. ఒక ఎంబీబీఎస్ వైద్యురాలు, వైద్య సిబ్బంది ఇరుకైన నాలుగు గదుల్లో వైద్య సేవలు అందించేందుకు అటు వైద్య సిబ్బంది, ఇటు రోగులు అవస్థలు పడుతున్నారు. ఫార్మాసిస్టు, ల్యాబ్ టేక్నిషన్ లేకపోవడం వల్ల పరీక్షల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చేందుకు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందులను వైద్య సిబ్బంది ఇవ్వాల్సి వస్తోంది. కేంద్రానికి ప్రత్యేక ఆన్‌లైన్ లింక్ ఇవ్వకపోవడం వల్ల మందుల సరఫరా సమస్యగా మారింది.
రోగులకు రవాణా భారం...
ముస్తాబాద్ : మండలంలోని పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రూ.1.50 కోట్లతో నిర్మించి ఇటీవల ప్రారంభించారు. సోమవారం ఆసుపత్రికి వచ్చిన రోగులు రక్తపరీక్ష కోసం మరలివెళ్లారు. రక్తపరీక్ష గదికి తాళం వేశారు. సిరిసిల్లలోని ప్రభుత్వాసుపత్రికి టెక్నిషియన్ వెళ్లాడని వైద్యాధికారి డాక్టర్ బత్తుల గీతాంజలి పేర్కొన్నారు. ఆసుపత్రికి జనరేటర్ తెప్పించి ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రికి కనెక్షన్ ఇవ్వలేదు. డీటిఆర్ కోసం సెస్ అధికారులకు దరాఖాస్తు చేసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రాత్రిపూట కరెంటు పోతే క్యాండిల్‌ను పెట్టుకోవాల్సి వస్తోంది. మండల కేంద్రం నుండి పోతుగల్ వైపు రావాణా సౌకర్యం తక్కువగా ఉండటంతో రోగులకు ప్రయాణభారం పెరుగుతోంది. ఇద్దరు స్టాఫ్ నర్సులు, కాంటింజెంట్ వర్కర్‌ల కొరత ఉంది.
ప్రహరి లేక ఇబ్బందులు
కోనరావుపేట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ లేక ఇబ్బంది పడుతున్నారు. 8 సంవత్సరాల క్రితం వరద తాకిడికి ప్రహరీ కూలిపోయింది. అప్పటినుంచి ప్రహరీ నిర్మించకపోవడంతో పశువులు, కుక్కలు లోపలికి వస్తున్నాయి. వైద్యాధికారి వేణుమాధవ్‌తో పాటు వైద్యులు సురేష్ కుమార్, ఆయుర్వేద వైద్యురాలు భ్యూల కుమారి వైద్య సేవలు అందిస్తుండగా, 16 మంది ఏఎన్‌ఎంలు ఉండాల్సి ఉండగా, 12 మంది ఉండడం వల్ల వైద్య సేవలు అందించడంలో ఇబ్బందికరంగా మారింది.
రవాణాభారం..
వేములవాడ రూరల్ : వేములవాడ రూరల్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హన్మాజిపేట గ్రామంలో ఉంది. పీహెచ్‌సీలో ప్రతీ రోజు డాక్టర్ దివ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్నారు. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయి. రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పీహెచ్‌సీలో సరిపడా సిబ్బంది ఉన్నారు. మండల కేంద్రంలో 17 గ్రామాలుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హన్మాజిపేటలో మండలానికి ఒకవైపు ఉండగా, మిగతా గ్రామాల ప్రజలకు రవాణా ఇబ్బందిగా మారింది.
నెలలో రెండు ప్రసవాలు..
చందుర్తి : చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు 80 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో, పాటు నెలలో ఒకటి రెండు ప్రసవాలు జరుగుతున్నాయి. పీహెచ్‌సీలో మందుల కొరత లేదని పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ వేదాచారి పేర్కొన్నారు. కుక్క కాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, పాము కాటుకు అందుబాటులో లేవన్నారు. సోమవారం రికార్డు పరిశీలించగా 80మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నమోదయింది. ఆరోగ్య కేంద్రం పరిధిలోని మూడపల్లి, బండపల్లి, మల్యాల, సనుగుల, మరిగడ్డ గ్రామాల్లో ఉప ఆరోగ్య కేంద్రాలు నడుస్తున్నాయి. పీహెచ్‌సీలో పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నారని, మెరుగైన వైద్యంతో పాటు మందులు కూడా పంపిణీ చేస్తున్నామని వైద్య డాక్టర్ తెలిపారు.
ఆటోల కోసం ఎదురుచూపులు..
- రంజాని సాయవ్వ, ముస్తాబాద్
పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండటంతో మండల కేంద్రం నుంచి ఆసుపత్రికి ఆటోలో వచ్చాను. ఆటో కోసం చాలా సేపు ఎదురుచూశాను. రూ.50 పెట్టి ఆసుపత్రికి వచ్చాను. మండల కేంద్రంలో ఆసుపత్రి ఉంటే అందరికీ వైద్య సేవలు అందేవి.
రక్తపరీక్షలు చేసేందుకు సిబ్బంది లేరు..
- లకావత్ లలిత, వీర్నపల్లి తండా
నా భర్తకు చలి జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి డాక్టర్‌కి చూపించాను. కానీ రక్త పరీక్షలు చేయడానికి ల్యాబ్ టెక్నిషియన్ లేడు. సబ్ సెంటర్ డాక్టర్ రక్తం తీసుకొని పరీక్షలకు జిల్లా ఆసుపత్రికి పంపిస్తా అన్నారు. పేద ప్రజలకు ఇక్కడే అన్ని సేవలందించాలి. సరిపడా మందులు అందుబాటులో ఉంచి పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించాలి.
మిషన్లను అందుబాటులోకి తేవాలి..
- అశ్విణి, గర్భిణి, వేములవాడ
నేను మొదటి కాన్పు నుంచి వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందుతున్నాను. ఎంతో ఓపికతో మాధవి మేడం పరీక్షలు చేసి సరైన సూచనలు చేస్తుంది. అందుచేతనే నేను రెండవ కాన్పు కోసం కూడా ఇక్కడే చూపించుకుంటున్నాను. అప్పుడే పుట్టిన శిశువులను చూసుకునేందుకు సరైన మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలి.
స్కానింగ్ కోసం వచ్చాను..
- హర్ష, బండపెల్లి, చందుర్తి
చందుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకున్నాను. స్కానింగ్ రిపోర్టు కోసమని వేములవాడ ఏరియా ఆసుపత్రికి పంపించారు. సీటీ స్కాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తే పేదలకు ఖర్చు లేకుండా అవుతుంది. వెంటనే సిటీ స్కాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి.