ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:46 PM
ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభత్వుం ఊరట కలిగించింది. అన్ని రాష్ట్రాల్లోని కూలీల వేతనాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- వేతనాలు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు
వాంకిడి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభత్వుం ఊరట కలిగించింది. అన్ని రాష్ట్రాల్లోని కూలీల వేతనాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణభివృద్ధి మంత్రిత్వశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవ త్సరానికి పెరిగిన కూలీ వేతనాలు వర్తించనున్నాయి.
ఫ రూ. 300 నుంచి రూ. 307కు...
రాష్ట్రంలో ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు దినసరి కూలిని 300 రూపాయల నుంచి 307రూపాయలకు పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 28 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ఏడాది ఏడు రూపాయలు పెంచింది. ఈ ఏడాది ప్రభుత్వం తక్కువ పెంచడంతో కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా మార్చి నుంచి జూన్ వరకు వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో కూలీల సంఖ్య పెరుగుతుంది. దీనిద్వారా ఏప్రిల్‌లో పెరగనున్న దినసరి కూలితో ఆర్థికంగా లాభం చేకూరనుంది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇదే కూలి ధరను వర్తింపచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ కుంటుంబాల జీవనోపాధి భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రతీగ్రామీణ కుంటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయడానికి ముందుకొచ్చేలా ఏడాది పొడవునా ఒక్కొక్కరికి వంద రోజులు పని కల్పిస్తోంది.
- ఉత్సహంలో కూలీలు...
కేంద్రం ప్రభుత్వం దినసరి కూలీ 307 రూపాయలకు పెంచడంతో ఉపాధికూలీలు ఉత్సాహంలో ఉన్నారు. కుమరం భీం జిల్లాలో 91,873 జాబ్‌కార్డులు ఉండగా 1,70,497 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా వేసవి కాలంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేస్తుంటారు. పెరిగిన కూలితో వీరికి ప్రయోజనం కలగనుంది. ఏప్రిల్ 1 నుంచి ఉపాధి పనులకు వచ్చే కూలీలకు రోజుకు ఒకరికి గరిష్టంగా 307రూపాయలకు చేరింది. ప్రారంభంలో 193 రూపాయలు కూలి ఉండగా ప్రస్తుతం 307 రూపాయలకు చేరింది. పదేళ్లలో 62.86 శాతం కూలి ధరను ప్రభుత్వం పెంచింది.
- వడదెబ్బ బారిన పడకుండా...
వేసవిలో కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వం సులభమైన పనులను సూచిస్తోంది. పూడికతీతతో పాటు పొలాలకు మట్టి రహదారులు, ఫారంపాండ్‌లు, గట్టుకాల్వల నిర్మాణం, పశువులు, గొర్రెలు, మేకల షెడ్లు వంటి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కూలీ డబ్బులు పెంచడంతో ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
- పనులవద్ద వసతులు కరవు...
మూడేళ్లుగా వేసవి భత్యం ఎత్తివేశారు. ఏప్రిల్, మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో 30 శాతం వరకు అదనపు భత్యం చెల్లించేవారు. అంతేకాకుండా కొలతల్లోనూ సడలింపు ఉండేది. వీటన్నింటితో వేసవిలో కూలీల సంఖ్య పెరుగుతుండేది. ప్రస్తుతం అదనపు భత్యంతోపాటు కొలతల్లో కూడా సడలింపు లేకపోవడంతో కూలీల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జిల్లా ఉన్నతాధికారులు ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు కూలీల సంఖ్య పెంచేందుకు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. కనీసం ప్రతీ పంచాయతీల్లో 40 మందికి తగ్గకుండా కూలీలు పనులకు వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. పనుల వద్ద వైద్యం, నీడ, తాగునీటి వసతి కల్పించాల్సి ఉండగా అధికారులు దృష్టి సారించకపోవడంతో చెట్టు నీడనే కూలీలకు ఆధారంగా మారింది. ప్రస్తుతం కూలీల సంఖ్య పెరగడమే కాకుండా వేసతి తీవ్రత పెరిగినం దున ఇబ్బంది లేకుండా వసతులు కల్పించేలా చూడాలని కూలీలు కోరుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
- శ్రావణ్‌కుమార్, ఈజీఎస్ ఏపీవో - వాంకిడి
పనులు కావాలని అడిగిన ప్రతీ ఒక్కరికి ఉపాధి పనులు కల్పిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం రోజు కూలిని 300 రూపాయల నుంచి 307 రూపాయలకు పెంచడంతో కూలీలకు ప్రయోజనం చేకూరుతుంది. కూలీలు ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి. పని ప్రదేశంలో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా ఉన్నతాధికారుల ఆదేశానుసారం వసతులు కల్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నాము.