China-Bangladesh: చైనాతో దోస్తీ కట్టిన యూనస్.. ఇండియాపై కుట్రకు ప్లాన్..
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:16 PM
China-Bangladesh: చైనా పర్యటన సందర్భంగా బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఇండియాతో శత్రుత్వం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతం ఇచ్చాడు. భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

China-Bangladesh: షేక్ హసీనా రాజీనామా తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి ముహమ్మద్ యూనస్ ఎన్నోసార్లు హసీనాకు ఇండియా ఆశ్రయం కల్పించడాన్ని తప్పుబట్టారు. బంగ్లా హిందువుల దాడులు మొదలుకుని ప్రతి విషయంలో ఇండియాకు వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు. న్యూఢిల్లీతో ద్వైపాక్షిక సంబంధాలు (India- Bangladesh) బలపరచుకునేందుకు మేం సిద్ధమంటూనే మరో పక్క చైనా, పాకిస్థాన్‌లతో చేతులు కలిపేందుకు ఆరాటపడుతున్నాడు. తాజాగా చైనా పర్యటన సందర్భంగా డ్రాగన్ మెప్పు పొందేందుకు భారతదేశంపై విషం వెళ్ళగక్కారు.
ఆ రాష్ట్రాలకు మరో దారి లేదు..
యూనస్ ఇటీవల నాలుగు రోజుల చైనా పర్యటన సందర్భంగా ఇండియాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పర్యటనలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిసి బీజింగ్‌తో తొమ్మిది ఒప్పందాలపై సంతకం చేసిన యూనస్.. చైనాను ఆకర్షించేందుకు భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించాడు. "భారతదేశంలోని తూర్పు ప్రాంతమైన ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అని పిలుస్తారు. ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. సముద్రాన్ని చేరుకోవడానికి వారికి మరో మార్గం లేదు" అని అన్నారు. ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్‌ను "సముద్రానికి ఏకైక సంరక్షకుడు" అని అభివర్ణిస్తూ.. చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ఇదో గొప్ప అవకాశం కావచ్చని వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు సంజీవ్ సన్యాల్ యూనస్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను Xలో పోస్ట్ చేశాడు. యూనస్ భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. "భారతదేశంలోని 7 రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉన్నాయని యూనస్ చైనీయులకు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా ఉంది. బంగ్లాదేశ్‌లో చైనా పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం తప్పు కాదు. కానీ ఈశాన్య రాష్ట్రాలను ప్రముఖంగా ప్రస్తావించడంలో ఆంతర్యం ఏమిటి?" అని మండిపడ్డారు.
బీజింగ్‌ను మంచి స్నేహితుడిగా చూడటం తమ దేశానికి "ముఖ్యమైనది" అని యూనస్ చైనాలో అన్నారు. అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సమావేశంలో బంగ్లాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు డ్రాగన్ సహకరించాలని కోరారు. సమావేశం తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్ (TRCMRP)లో పాల్గొనడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ స్వాగతించింది. 2.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, రుణాలు, గ్రాంట్ల ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. చైనా, బంగ్లా ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజుల చైనా పర్యటనలో పెకింగ్ విశ్వవిద్యాలయం (PKU) యూనస్‌కు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించింది.
Read Also: Japan: జపాన్‌కు మెగాక్వేక్ సూచన.. ఇక వినాశనమే..
Elon Musk: ఆష్లేపై మస్క్ సంచలన కామెంట్లు.. ఆ బిడ్డ నాదో కాదో తెలీదు..
Viral Video: నువ్వు నిజంగా హీరోవి బాసు.. కత్తికి కూడా భయపడలేదు..