Bandi Sanjay: రేవంత్.. మీకు మానవత్వం లేదా?
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:50 AM
సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, విద్యార్థుల ఆందోళనకు బీజేపీ మద్దతు ప్రకటించింది.

విద్యార్థినుల జుట్టు పట్టుకుని లాక్కెళ్తారా?
భూములమ్మితే తప్ప పాలించే పరిస్థితి లేదా?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించాలంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘సీఎం రేవంత్.. మీకు కనీస మానవత్వం లేదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే... వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని చూడకుండా జుట్టు పట్టుకుని లాక్కెళ్తారా? ఇదేం పద్ధతి? భూములు అమ్మితే తప్ప రాష్ర్టాన్ని పాలించే పరిస్థితి లేదా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అంతమాత్రానికి మీరెందుకు... కేఏ పాల్‌కు అప్పగించినా అదే పని చేస్తారు’’ అని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, మొత్తం ఘటనపై విచారణ జరపాలని సంజయ్ డిమాండ్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జి జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోందని నిలదీశారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని చెప్పారు. కాగా, తెలంగాణలో హరిత విధ్వంసం జరుగుతోందని సంజయ్ ఆరోపించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం 25లక్షల చెట్లను నరికేసి, హరితహారం పేరుతో కొనోకార్పస్ కల్లోలం తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికి ప్రకృతిని నాశనం చేస్తోంది. గొడ్డలి మారలేదు.. పట్టిన చేతులే మారాయి. తెలంగాణాలో పాలన.. అటవీ నాశన మాఫియా చేతిలో బందీ అయింది’’ అని ఎక్స్ వేదికగా విమర్శించారు. కాగా, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఫొటో పెట్టకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రూప్-1లో మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News