Share News

Polavaram Project Issues: జగన్‌ రివర్స్‌ దెబ్బ

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:59 AM

పోలవరం ప్రాజెక్టు పనులలో రివర్స్ టెండరింగ్‌పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాలు, అవన్నీ ఖజానాకు భారంగా మారాయని విమర్శలు రావడం. 2019 నాటికి 72% పనులు పూర్తయ్యాయి కానీ, జగన్మోహన్ రెడ్డి ఆమోదించిన పనులు పూర్తి కాకపోవడం, వ్యయం పెరగడం వంటి అనేక సమస్యలు తలెత్తాయి

Polavaram Project Issues: జగన్‌ రివర్స్‌ దెబ్బ

  • పోలవరంలో ఆదా అంటూ నాడు ఆర్భాటం

  • నేడు నష్టం, వ్యయం తడిసి మోపెడు

  • రూ.1,548 కోట్ల పనుల అంచనాలు రూ.4,637 కోట్లకు పెంపు

  • డయాఫ్రం వాల్‌కు 980 కోట్లు అదనం

  • కాంట్రాక్టు సంస్థ తొలగింపు ఫలితం

  • ఆర్బిట్రేషన్‌ ఆదేశాలతో నవయుగకు రూ.1735 కోట్ల పరిహారం

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్రానికి మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఆ ఐదేళ్లలో చేసిన నిర్వాకాలు ఖజానాకు భారంగా మారాయి. శరవేగంగా పనులు చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్‌ కాంట్రాక్టు సంస్థను.. కేంద్రం మొత్తుకున్నా అర్ధాంతరంగా తీసివేశారు. వెంటనే రివర్స్‌ టెండర్‌కు వెళ్లారు. హెడ్‌వర్క్స్‌లో మిగిలిన రూ.1,771 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. రివర్స్‌ టెండర్‌లో కనీసం రెండు కంటే ఎక్కువ నిర్మాణ సంస్థలు బిడ్లు వేయాలి. కానీ మేఘా ఇంజనీరింగ్‌ ఒక్కటే బిడ్‌ దాఖలుచేసింది. టెండరును 12ు తక్కువకు రూ.1,548.12 కోట్లకు అప్పగించారు. పనులను 2020 నవంబరు నాటికి పూర్తి చేయాలని టెండరు డాక్యుమెంటులో కోరారు. కానీ అప్పటికి పనులే చేపట్టలేదు. నిర్మాణం మొదలు పెట్టకుండానే అదనపు పనుల పేరిట రూ.2,077.78 కోట్లకు అంచనాలు పెంచేశారు. అదికాకుండా కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సిఫారసుల పేరిట రూ.669 కోట్లు, రూ.1,615.75 కోట్లతో టెండర్లు పిలిచారు. 2 శాతం ప్లస్‌తో టెండర్లను మేఘా దక్కించుకుంది. అంటే రూ.1,548.12 కోట్ల అంచనాలను 4,362 కోట్లకు పెంచారన్న మాట. వాస్తవానికి 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చేనాటికి హెడ్‌వర్క్స్‌ 72 శాతం పూర్తయ్యాయి. ఆయన వచ్చాక రెండేళ్లు గడిచినా పనులు పూర్తిచేయకపోవడం.. వరదలకు డయాఫ్రం వాల్‌ తీవ్రంగా దెబ్బతింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల్లో సీపేజీ వచ్చింది. గైడ్‌బండ్‌ కుంగిపోయింది. నిర్మాణ వ్యయం నాలుగింతలు పెరిగింది. గతంలో రూ.465 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా రూ.980 కోట్లతో కొత్తది నిర్మించాల్సి వస్తోంది.


ఇది అదనపు వ్యయం. ఇక సిమెంట్‌ కాంక్రీట్‌ పనుల కోసం రూ.400 కోట్లను అదనంగా ఖర్చుచేశారు. అప్పటిదాకా ఇసుకను ఉచితంగా వాడేవారు. కానీ జగన్‌ సర్కారు రూ.600 కోట్లు లెక్కవేసి తెలంగాణకు చెందిన అస్మదీయ కాంట్రాక్టు సంస్థకు చెల్లించింది. ఇంకోవైపు.. తనను అర్ధాంతరంగా తొలగించడంతో నవయుగ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. ఆ సంస్థకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ సంస్థకు రూ.1,735 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్‌ గురువారం ఆమోద ముద్ర వేసింది. ఇందులో ఏపీ జెన్కో రూ.986.17 కోట్లు, జల వనరుల శాఖ 742 కోట్లు చెల్లించనున్నాయి. నిర్మాణ సంస్థను మార్చకుండా 2020లోనే పనులు పూర్తి చేసి ఉంటే.. ఏటా రూ.26,000 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు రైతుల చేతికి అందేవి. మొత్తంగా జగన్‌ నిర్వాకంతో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. ఈ విధ్వంసానికి ఎవరు బాధ్యత వహిస్తారు? చంద్రబాబుపై కోపంతో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లిన జగన్‌ జవాబుదారీయా.. ఆయన చెప్పిందే తడవుగా.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లిన నాటి జల వనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యత తీసుకుంటారా అని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 06:00 AM