Share News

Kishan Reddy: అంబేడ్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ది

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:47 AM

అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో కుట్రచేసి ఆయన్ను ఓడించిన నీచమైన మనస్తత్వం కాంగ్రెస్‌ పార్టీదని దుయ్యబట్టారు.

Kishan Reddy: అంబేడ్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ది

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

  • చంపినోడే సంతాపసభ పెట్టినట్లుంది

  • కాంగ్రె్‌సపై బండి సంజయ్‌ మండిపాటు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో కుట్రచేసి ఆయన్ను ఓడించిన నీచమైన మనస్తత్వం కాంగ్రెస్‌ పార్టీదని దుయ్యబట్టారు. దేశానికి విశేష సేవలందించిన ప్రముఖులు మరణించినప్పుడు వారి అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించే సంప్రదాయం ఉందని, అయితే, అంబేడ్కర్‌ మరణించినప్పుడు ఆ గౌరవం కల్పించకుండా, ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీ నుంచి ముంబైకి తరలించారని, అంబేడ్కర్‌ పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న వైఖరికి ఇది నిదర్శనమని కిషన్‌రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ట్యాంక్‌ బాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కిషన్‌రెడ్డి స్వయంగా బైక్‌ నడిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌, కాలరాసి ఎమర్జెన్సీని విధించి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించిందని ధ్వజమెత్తారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌. కుమార్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచన విధానాలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల ను పండుగలా నిర్వహించాలంటూ కాంగ్రెస్‌ ప్రభు త్వం ఆదేశించడం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. ‘కాంగ్రెస్‌ తీరు ఎట్లుందంటే చంపినోడే సంతాపసభ పెట్టినట్లుగా ఉంది’ అని దుయ్యబట్టారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా అవమానించడమే కాకుండా ఆయనను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్‌ ఇచ్చిందే కాంగ్రెస్‌ అని అలాంటి పార్టీ ఇప్పుడు అంబేడ్కర్‌ జయంతిని పండుగలా నిర్వహించాలనడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీసీలు, రాజ్యాం గం పట్ల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ కులగణన పేరుతో కుట్ర చేస్తోందని విమర్శించారు.

Updated Date - Apr 15 , 2025 | 05:47 AM