BRS Govt Digital Media Director: కొణతం దిలీప్ విదేశీ పర్యటనలకు రూ.18.45 కోట్లు!
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:19 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేసిన కొణతం దిలీప్ విదేశీ పర్యటనలకు రూ.18.45 కోట్లు ఖర్చు చేశారు. 2014 నుండి 2023 వరకు ఆయన తరచూ అమెరికా, స్విట్జర్లాండ్, యూకే తదితర దేశాలకు పర్యటించారు

ఎనిమిదేళ్లలో గత ప్రభుత్వం చేసిన ఖర్చు ఇది
2016 నుంచి 2023 డిసెంబరు 3 వరకు టూర్లు
అమెరికా, స్విట్జర్లాండ్, యూకే పర్యటనలకు
వెళ్లిన నాటి డిజిటల్ మీడియా డైరెక్టర్
ఆర్‌టీఐ దరఖాస్తుకు వివరాలు వెల్లడించిన ఐటీ శాఖ
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పని చేసిన కొణతం దిలీప్ విదేశీ పర్యటనలకు భారీగా ఖర్చు చేశారు! ఆయన పర్యటనల కోసం గత ప్రభుత్వం ఏకంగా రూ.18.45 కోట్లు వెచ్చించడం గమనార్హం! సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద ఓ కార్యకర్త వివరాలు అడగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొణతం దిలీప్ విదేశీ పర్యటనలకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని కోరగా.. ఐటీ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఎనిమిదేళ్లలో ఆయన ఏటా విదేశీ పర్యటనలకు వెళ్లారని.. అందుకు రూ.18,45,07,520 ఖర్చయినట్లు వివరించింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ 2014లో కొణతం దిలీప్‌ను రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా నియమించారు. అప్పటి నుంచి 2023 డిసెంబరు వరకు ఆయనా పదవిలో కొనసాగారు. 2016 ఆగస్టు 1నుంచి 2023 డిసెంబరు 3వరకు పలుమా ర్లు విదేశాలకు వెళ్లారు. అమెరికా, స్విట్జర్లాండ్‌లోని దావోస్, యూకేల్లో పర్యటించారని ఆర్‌టీఐ కార్యకర్తకు ఇచ్చిన వివరాల్లో ప్రభుత్వం వెల్లడించింది.