Share News

SRH vs LSG IPL 2025: సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో క్లాష్.. ఈ ఆరుగురి ఆట మిస్ అవ్వొద్దు

ABN , Publish Date - Mar 27 , 2025 | 02:32 PM

SRH vs LSG Key Players: సన్‌రైజర్స్-లక్నో సూపర్ జియాంట్స్ నడుమ మరికొన్ని గంటల్లో క్లాష్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్‌లో తప్పక గమనించాల్సిన ఆటగాళ్లు కొందరు ఉన్నారు. వాళ్ల ఆటను అస్సలు మిస్ అవ్వొద్దు.

SRH vs LSG IPL 2025: సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో క్లాష్.. ఈ ఆరుగురి ఆట మిస్ అవ్వొద్దు
SRH vs LSG IPL 2025

ఉప్పల్ స్టేడియం మరో భీకర ఫైట్‌కు సాక్ష్యంగా నిలవనుంది. కప్పు వేటలో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, బోణీ కోసం ఎదురు చూస్తున్న లక్నో సూపర్ జియాంట్స్ మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ ఫైట్ జరగనుంది. ఏ రకంగా చూసుకున్నా ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో తప్పక గమనించాల్సిన ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


ట్రావిస్ హెడ్

సన్‌రైజర్స్ విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 31 బంతుల్లో 67 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. హెడ్ గనుక పవర్‌ప్లే వరకు నిలబడినా ఆరెంజ్ ఆర్మీ స్కోరు ఈజీగా 100 మార్క్‌ను దాటేస్తుంది. అతడ్ని ఆపకపోతే లక్నోకు పీడకల తప్పదనే చెప్పాలి.

ఇషాన్ కిషన్

బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి, టీమిండియాలో ప్లేస్ పోయి ఇబ్బందుల్లో ఉన్న ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ తరఫున అదరగొడుతున్నాడు. ఆరెంజ్ జెర్సీ వేసుకున్న ఫస్ట్ మ్యాచ్‌లోనే 47 బంతుల్లో 106 నాటౌట్‌తో ప్లేయర్ ఆఫ్ ది అవార్డుకు ఎంపికయ్యాడు. పరుగుల దాహంతో ఉన్న ఇషాన్‌.. ఈ సీజన్‌లో అంతా తన గురించే మాట్లాడాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు.


హెన్రిక్ క్లాసెన్

ఎస్‌ఆర్‌హెచ్ కీలక బ్యాటర్ క్లాసెన్ ఈ సీజన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 14 బంతుల్లోనే 34 పరుగులతో కదంతొక్కాడు. అతడు గానీ చెలరేగితే ఇవాళ వార్ వన్ సైడ్ అనే చెప్పాలి.

నికోలస్ పూరన్

లక్నో జట్టులోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు. ముఖ్యంగా పూరన్ కసి మీద ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో అతడు 30 బంతుల్లోనే 75 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అతడి జోరుకు ఎంత త్వరగా బ్రేకులు వేస్తే సన్‌రైజర్స్‌కు అంత మంచిది. పూరన్‌తో పాటు ఢిల్లీతో మ్యాచ్‌లో 36 బంతుల్లో 72 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడిన మిచెల్ మార్ష్‌ కూడా ఇవాళ గెలుపోటములను శాసించే అవకాశం కనిపిస్తోంది.


రవి బిష్ణోయ్

ఈ మ్యాచ్‌లో బ్యాటర్లే కాదు.. కొందరు బౌలర్లు కూడా గమనించదగ్గ ఆటగాళ్లుగా ఉన్నారు. లక్నో స్పిన్నర్ బిష్ణోయ్ అందులో ఒకడు. తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. ఇవాళ గనుక అతడు బంతిని టర్న్ చేస్తే కమిన్స్ సేనకు తిప్పలు తప్పవు.

ఆడమ్ జంపా

ఉప్పల్ పిచ్‌పై బంతిని గింగిరాలు తిప్పుతూ ప్రత్యర్థిని పడగొట్టాలని చూస్తున్నాడు జంపా. పెద్దగా ఫామ్‌లోని లేని ఈ కంగారూ స్పిన్నర్ గనుక టచ్‌లోకి వస్తే.. లక్నోకు దబిడిదిబిడే.


ఇవీ చదవండి:

ఉప్పల్ ఫైట్‌లో గెలిచేదెవరంటే..

ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో.. ప్లేయింగ్ 11 ఇదే..

పాయింట్స్ టేబుల్‌లో ఊహించని ట్విస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 27 , 2025 | 02:33 PM