Share News

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే బడ్జెట్‌

ABN , Publish Date - Mar 20 , 2025 | 05:26 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ ఎంపీలు అన్నారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలకూ న్యాయం జరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విప్లవ నాయకుడని కొనియాడారు.

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే బడ్జెట్‌

  • సీఎం రేవంత్‌రెడ్డి విప్లవ నాయకుడు

  • బీసీ రిజర్వేషన్ల కోసం ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరతాం: ఎంపీలు

  • మెట్రో రెండోదశకు అనుమతులివ్వండి

  • ప్రధాని మోదీకి ఎంపీ చామల లేఖ

న్యూఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ ఎంపీలు అన్నారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలకూ న్యాయం జరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విప్లవ నాయకుడని కొనియాడారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, సురేష్‌ షెట్కార్‌ మీడియాతో మాట్లాడారు. విజన్‌-2050 అమలును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని తెలిపారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులను దశలవారీగా తీర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం గొప్పల కోసం ఎక్కువ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశ పెడుతోందని తెలిపారు.


ఇక 42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ కోరతామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాటకైనా సిద్ధమేనని ప్రకటించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. మరోవైపు హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. మెట్రో విస్తరణ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం గతేడాది నవంబరు 4న కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. పత్రాలన్నీ కేంద్ర నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ఉన్నందున మెట్రో రెండో దశకు సహకరించాలని కోరారు. ఎంపీ చామల లేఖకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తూ జవాబిచ్చారు.

Updated Date - Mar 20 , 2025 | 05:26 AM