Hyderabad: ఇక్కడ.. ఎనీటైం మందు గురూ..
ABN , Publish Date - Jan 17 , 2025 | 10:52 AM
రాత్రి లేదు.. పగలు లేదు.. ఎప్పుడైనా సరే అక్కడ మద్యం అందుబాటులో ఉంటుంది. ఎక్కడో ఉన్న వైన్‌షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కన ఉండే గల్లీలోనే మద్యం లభిస్తుంది.. అంతేనా.. అవసరమైతే ఫోన్‌లో ఆర్డరిస్తే చాలు ఇంటికి సైతం సరఫరా చేస్తారు..

- ఇచ్చట 24/7 మద్యం లభించును..
- రాత్రి ఒంటి గంటకైనా.. తెల్లవారు జామున మూడు గంటలకైనా..
- బడంగ్‌పేట్, మీర్‌పేట్‌లల ఇష్టారాజ్యంగా బెల్టుషాపులు
- మద్యానికి బానిసలై ప్రాణాలు విడుస్తున్న నిరుపేదలు
- పట్టించుకోని ఎక్సైజ్, సివిల్ పోలీసులు
హైదరాబాద్: రాత్రి లేదు.. పగలు లేదు.. ఎప్పుడైనా సరే అక్కడ మద్యం అందుబాటులో ఉంటుంది. ఎక్కడో ఉన్న వైన్‌షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కన ఉండే గల్లీలోనే మద్యం లభిస్తుంది.. అంతేనా.. అవసరమైతే ఫోన్‌లో ఆర్డరిస్తే చాలు ఇంటికి సైతం సరఫరా చేస్తారు.. ఇదీ సరూర్‌నగర్(Saroornagar) ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మీర్‌పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్లలోని పరిస్థితి! 24గంటలూ తెరిచి ఉంచే బెల్టు షాపుల్లో ఎక్కువగా చీప్ లిక్కర్, ఇంకాస్త మెరుగైన బ్రాండు మద్యం మాత్రమే లభిస్తుంటుంది.
ఈ వార్తను కూడా చదవండి: Lakshman: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం కృషిచేయాలి
సదరు చీప్ లిక్కర్(Cheap liquor)కు బానిసలైన పేద, బడుగువర్గాల ప్రజలు తమ చెంతనే నిరాటంకంగా లభించే మద్యం కొనుగోలు చేస్తూ ఆర్థికంగా చితికి పోవడమే కాకుండా చివరకు అనారోగ్యం బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఒక్క బాలాపూర్(Balapur)లోనే గడిచిన ఏడాదిలో ఐదారుగురు యువకులు మద్యానికి బానిసలై శరీరంలోని అవయవాలు పాడై మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం బడంగ్‌పేట్ మునిసిపల్ కార్యాలయంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసే సత్యనారాయణ సైతం మద్యం తాగడం వల్ల మరణించడం గమనార్హం.
ఒక్కో గ్రామంలో పదేసి బెల్టు షాపులు
సరూర్‌నగర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మీర్‌పేట్, జిల్లెలగూడ, నందనవనం, లెనిన్‌నగర్, అల్మా్‌సగూడ, రాజీవ్ గృహకల్ప, నాదర్‌గుల్, గుర్రంగూడ, బడంగ్‌పేట్, గాంధీనగర్, బాలాపూర్, మల్లాపూర్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయం తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. బాలాపూర్, అల్మా్‌సగూడ, నాదర్‌గుల్‌లాంటి ప్రాంతాల్లో పదేసి చొప్పున షాపులు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆయా షాపులు రాత్రి ఒంటి గంట దాకా తెరిచే ఉండడం ఒక ఎత్తు కాగా.. మళ్లీ తెల్లవారు జామున మూడు గంటలకే తెరుచుకోవడం ఇక్కడ గమనార్హం! మద్యానికి బానిసలైన పేద, బడుగువర్గాల ప్రజలు ఇలా నిరంతరం తెరిచి ఉండే బెల్టుషాపులను ఆశ్రయించి తమ సంపాదనంతా మద్యానికి ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. దీనికంతటికి బెల్టు షాపులే కారణమని ఆయా ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకైనా, తెల్లవారు జామున మూడు గంటలకైనా వెళ్లి తలుపు కొడితే చాలు.. మద్యం అందజేస్తున్న బెల్టు షాపులు అనేకం ఉన్నాయి.
అమ్యామ్యాలు పెంచుకోవడానికే దాడులు..
తమకు నెలవారీ వచ్చే అమ్యామ్యాలు పెంచుకోవడానికే ఎక్సైజ్, పోలీసులు అప్పుడప్పుడు బెల్టు షాపులపై దాడులు చేస్తుంటారని, ఆ తర్వాత ‘సెటిల్‌మెంట్’ చేసుకుని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు మీర్‌పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రజల నుంచి వినవస్తున్నాయి. గతంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లు కూడా ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. దాంతో బెల్టు షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతున్నారు.
ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నట్టు..
ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసులు సైతం బెల్టుషాపుల నియంత్రణకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు షాపుల నిర్వాహకులతో పాటు ఆయా ప్రాంతాల్లోని వైన్‌షాపుల నుంచి వారికి నెలవారీ మామూళ్లు అందుతుంటాయని, అందుకే బెల్టు షాపుల జోలికి వెళ్లడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రజా ప్రతినిధులు సైతం వాటిపై దృష్టి పెట్టకపోవడంతో పేద, బడుగువర్గాల యువకులు తాగితాగి ప్రాణాలు కోల్పోతున్నారు.
బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలి
బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్ల పరిధిలో కొనసాగుతున్న మద్యం బెల్టు షాపులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. బెల్టుషాపుల వల్ల ఎక్కువగా దళిత సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలే మద్యానికి బానిసలుగా మారి అనారోగ్యంతో ఆస్పత్రిపాలై మరణిస్తున్నారు. దాంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఒక్క బాలాపూర్‌లోనే ఐదారుగురు ఇలా చనిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బెల్టు షాపుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
- ఇబ్రాం శేఖర్, డిప్యూటీ మేయర్, బడంగ్‌పేట్
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News