Share News

Hyderabad: తీగ లాగితే.. డొంకంతా కదిలింది..

ABN , Publish Date - Mar 20 , 2025 | 08:23 AM

పసిపిల్లల కొనుగోలు, విక్రయాలతో పెద్దమొత్తంలో డబ్బులొస్తాయని అమూల్యను అతడు మభ్యపెట్టాడు. దీంతో ఇద్దరు కలిసి పిల్లలు లేని ఓ ఒంటరి మహిళకు మగ శిశువును అమ్మి సొమ్ము చేసుకున్నారు.

Hyderabad: తీగ లాగితే.. డొంకంతా కదిలింది..
Hyderabad Police

హైదరాబాద్‌, మార్చి 20: పసి పిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న 11 మంది నిందితులను గత నెలలోనే కటాకటాల్లోకి నెట్టారు. అయితే కస్టడీలో వారిచ్చిన సమాచారం మేరకు తాజాగా మరో 9 మంది దళారులు, చిన్నారులను కొనుగోలు చేసిన 18 మంది తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 21 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు.. అందులో 10 మందిని రక్షించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. బుధవారం హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో రాచకొండ సీపీ సుధీర్‌బాబు మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ‘ఈ వ్యవహారంలో తొలుత అరెస్టయిన కృష్ణవేణి, వందనలను విచారించగా.. ప్రధాన నిందితురాలు మలక్‌పేటకు చెందిన ఆశా వర్కర్‌ సోము అమూల్య (29) పేరు వెలుగులోకి వచ్చింది.


అమూల్య ఆశా వర్కర్‌గా ఆజంపురా యూపీహెచ్‌సీలో పనిచేస్తోంది. అయితే మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో సూపర్‌వైజర్‌గా పనిచేసే ఇస్మాయిల్‌తో ఆమెకు పరిచయమేర్పడింది. పసిపిల్లల కొనుగోలు, విక్రయాలతో పెద్దమొత్తంలో డబ్బులొస్తాయని అమూల్యను అతడు మభ్యపెట్టాడు. దీంతో ఇద్దరు కలిసి పిల్లలు లేని ఓ ఒంటరి మహిళకు మగ శిశువును అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత అమూల్యకు కృష్ణవేణి, వందన, దీప్తి పరిచయమయ్యారు. అంతా కలిసి అక్రమంగా శిశువుల కొనుగోలు, విక్రయాలు మొదలుపెట్టారు. సోషల్‌ మీడియా ద్వారా ఇతర రాష్ట్రాల వారినీ పరిచయం చేసుకుని దందా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే వారందరినీ గుర్తించి అరెస్టు చేశాం’ అని సీపీ వివరించారు. చట్టబద్ధంగా శిశువులను దత్తత తీసుకోవాలని సూచించారు. అక్రమంగా శిశువులను కొనుగోలు చేయడం, అమ్మడం నేరమని హెచ్చరించారు.


Also Read:

కేటీఆర్ జిల్లాల బాట..

దారుణం.. యువతి ప్రైవేటు వీడియోలు తీసి ఆపై..

ఇది చూసాక అయినా మనోళ్లకు బుద్ధొస్తుందా?

For More Telangana News and Telugu News..

Updated Date - Mar 20 , 2025 | 08:23 AM