Share News

US Migrants Legal Status Revoked: అమెరికాలో 5.3 లక్షల మంది విదేశీయులకు సామూహిక బహిష్కరణ ముప్పు

ABN , Publish Date - Mar 22 , 2025 | 08:18 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన 5.3 లక్షల మంది వలసదారుల చట్టబద్ధ రక్షణను తొలగిస్తామని స్పష్టం చేశారు. దీంతో, మరోసారి సామూహిక బహిష్కరణల భయాలు ఆకాశాన్నంటాయి.

US Migrants Legal Status Revoked: అమెరికాలో 5.3 లక్షల మంది విదేశీయులకు సామూహిక బహిష్కరణ ముప్పు
US Migrants Legal Status Revoked

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. అగ్రరాజ్యంలో ఉంటున్న సుమారు 5.3 లక్షల మంది విదేశీయులకు ఉన్న చట్ట బద్ధ రక్షణలను ఉపసంహరించుకుంటామని శుక్రవారం ప్రకటించారు. ఫలితంగా వీరందరూ త్వరలో సామూహికంగా దేశ బహిష్కరణకు గురవుతారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి (US Migrants Legal Status Revoked).

క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన వారి చట్టబద్ధ రక్షణలను తొలగిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా మీడియా కథనాల ప్రకారం, ఫైనాన్షియల్ స్పాన్సర్స్ సాయంతో వీరందరూ 2022 అక్టోబర్ తరువాత అక్టోబర్‌కు వచ్చారు. రెండేళ్ల పాటు దేశంలో ఉండి పని చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి పొందారు. ఈ నాలుగు దేశాల వారికి ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకునేందుకు ట్రంప్ సర్కారు నిర్ణయించడంతో ఏప్రిల్ 24 తరువాత అమెరికాను వీడాల్సి రావచ్చు.


Also Read: వైట్‌ హౌస్ వాగ్వివాదం తరువాత తొలిసారిగా ట్రంప్-జెలెన్‌స్కీ చర్చలు

మునుపటి బైడెన్ ప్రభుత్వం మానవత్వ సాయంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్గత కల్లోలాలు, యుద్ధాల కారణంగా అతలాకుతలం అవుతున్న దేశాల్లోని వారిని అమెరికాలోకి అనుమతించేందుకు ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తొలుత వెనిజులా దేశంతో మొదలైన ఈ పథకాన్ని క్రమంగా మిగతా మూడు దేశాలకు విస్తరించింది. ఆయా దేశాల నుంచి అక్రమ వలసల నిరోధానికి కూడా ఇది ఉపయోగపడుతుందని బైడెన్ ప్రభుత్వం భావించింది.

అయితే, ఈ వ్యవస్థ భారీగా దుర్వినియోగం అవుతూందని ట్రంప్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఏకంగా వ్యవస్థనే రద్దు చేసేందుకు నిర్ణయించింది. చట్టబద్ధ రక్షణ కోల్పోయిన వారు తమ అనుమతులు ముగిసే నాటికి దేశాన్ని వీడాలని అమెరిక డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. లేని పక్షంలో తామే స్వయంగా పంపిస్తామని స్పష్టం చేసింది.


Also Read: మంటల్లో టెస్లా కార్లు.. ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం

అధికారం చేపట్టిన నాటి నుంచే ట్రంప్ వలసలపై ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇక అక్రమ వలసదారులను చేతులు, కాళ్లకు బేడీలు వేసి మరీ అమెరికా నుంచి పంపించేస్తున్నారు. వలసలదారుల కోసం బైడెన్ సర్కారు గతంలో ప్రారంభించిన విధానాలు చట్టబద్ధ పరిమితులను దాటాయనేది ట్రంప్ వాదన. వీటిని రద్దు చేస్తామంటూ జనవరి 20న ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు.

Read Latest and International News

Updated Date - Mar 22 , 2025 | 09:21 PM