Share News

Heatwaves Impact: ఈ మూడు నెలలూ మంటలే..

ABN , Publish Date - Apr 01 , 2025 | 04:52 AM

ఈ వేసవిలో భారతదేశంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించింది.

Heatwaves Impact: ఈ మూడు నెలలూ మంటలే..

పెరగనున్న పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు

సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు

అనేకచోట్ల 45 డిగ్రీలు, కొన్నిచోట్ల అంతకు

మించి.. హీట్‌వేవ్‌ జోన్‌లో ఏపీ, తెలంగాణ

వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరం

ప్రజలను అప్రమత్తం చేయాలి: ఐఎండీ

రాష్ట్రంలో నేడు, రేపు వర్ష సూచన

విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే రెండు నెలల నుంచి ఎండలు, వడగాడ్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఇక రానున్న మూడు నెలల్లో కూడా ఎండ తీవ్రత, వడగాడ్పులు అంతకుమించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదుకానున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా హీట్‌వేవ్‌ జోన్‌లో ఉన్న దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వేసవి నుంచి గట్టెక్కడానికి కేంద్ర, రాష్ట్రాల పరిధిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తొలిసారిగా సూచనలు చేసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల వేసవి సీజన్‌కు సంబంధించి సోమవారం భారత వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. మూడు నెలల సీజన్‌లో దక్షిణ భారతంలో పడమర ప్రాంతాలు, తూర్పు భారతం, దానికి ఆనుకుని మధ్య భారతంలో కొన్ని ప్రాంతాలు తప్ప.. దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతం, దానికి ఆనుకుని దక్షిణాది రాష్ట్రాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లోని ఉత్తర ప్రాంతంలో సగటు కంటే ఎక్కువగా వడగాడ్పులు వీస్తాయి. సాధారణంగా ఈ సీజన్‌లో నెలకు ఐదు నుంచి ఆరు రోజులు వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీస్తాయి.


అటువంటిది ఈ ఏడాది ఈ మూడు నెలల సీజన్‌లో ఐదు నుంచి ఎనిమిది రోజులు గాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్‌ వరకు చూస్తే పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఇంకా వడగాడ్పులు తీవ్రంగా ఉండడంతో పాటు సాధారణం కంటే ఎక్కువ రోజులు కొనసాగుతాయి. ఏప్రిల్‌లో దక్షిణ, పడమర, తూర్పు భారతంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, దేశంలోని మిగతా ప్రాంతాల్లో తక్కువగా వర్షపాతం నమోదుకానుంది. ఏప్రిల్‌లో దేశంలో 39.2 మి.మీ. వర్షపాతం నమోదుకావాలి. గడచిన రెండు నెలల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షం జాడ లేకపోడంతో నేల పొడిగా మారిందని, దాంతో ఎండలు, గాడ్పులు పెరిగాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల మేరకు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలో హీట్‌వేవ్‌ కోర్‌ జోన్‌లో 10 అంతకంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మార్చిలో అనేకచోట్ల 40 డిగ్రీలు దాటి పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు నెలల కాలంలో అనేకచోట్ల 45 డిగ్రీలు, అక్కడక్కడా మరింత ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడు నెలల్లో ఎండలు, వడగాడ్పుల ప్రభావం నుంచి తట్టుకునేలా కేంద్ర, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకించి వేసవి ఉపశమన ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది. వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులుపడే వ్యక్తులు మరింత అప్రమ్తతంగా ఉండాలని హెచ్చరించింది. ఎక్కువగా చలువ కేంద్రాల ఏర్పాటుతోపాటు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేయాలని, ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వడం, ఎండలు, గాడ్పుల వల్ల ఇబ్బందులపై హెచ్చరికలు జారీచేయడం, నగరాల్లో అర్బన్‌ హీట్‌ ఐలాండ్స్‌ను గుర్తించి చలువ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటివి చేయాలని భారత వాతావరణ శాఖ సూచించింది.


ఇలా చేస్తే మేలు

వచ్చే మూడు నెలలు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.

వేడి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్‌, కూలర్లు, ఏసీలు వినియోగించాలి.

తరచూ నీరు తాగాలి. సాయంత్రం, రాత్రి వేళ చన్నీటితోనే స్నానం చేయాలి.

ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ నీళ్లు, కొబ్బరి నీరు తీసుకోవాలి.

ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తెల్లటి కాటన్‌ వస్త్రాలు ధరించాలి. తలకు టోపీ పెట్టుకోవాలి.

ఎండలో వెళ్లినప్పుడు వాంతులైతే.. వడదెబ్బగా గుర్తించాలి. వైద్యులను సంప్రదించాలి.

బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులు బయట తిరగరాదు.

ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె, పంచదార వంటి తీపి పదార్థాలు తీసుకోకూడదు.

బయటకు వెళ్లినప్పుడు శీతలపానీయాలు, ఐస్‌లు, ఆల్కహాల్‌, టీ, కాఫీ తాగడం మానుకోవాలి.


నేడు, రేపు వర్ష సూచన

రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చాలాచోట్ల గంటకు 40- 50 కి.మీల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. అక్కడక్కడ వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజుల క్రితంతో పోల్చితే రాష్ట్రంలో సోమవారం కొంత మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిలదారిలో, ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌, పెంచికల్‌ మండలాల్లో 41.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలు, కనిష్ఠ ఉషోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 07:21 AM