Nizamabad: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నో టికెట్
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:15 AM
నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కట్లేదా? ఆ సీటుకు కాంగ్రెస్ పార్టీ, మరో అభ్యర్థిని నిలబెట్టనుందా? ఈ ప్రశ్నలకు గాంధీభవన్ వర్గాలు అవుననే అంటున్నాయి.
నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సిటింగ్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీ
పరిశీలనలో నలుగురి పేర్లు.. ఈ వారంలోనే నిర్ణయం
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు!
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కట్లేదా? ఆ సీటుకు కాంగ్రెస్ పార్టీ, మరో అభ్యర్థిని నిలబెట్టనుందా? ఈ ప్రశ్నలకు గాంధీభవన్ వర్గాలు అవుననే అంటున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జీవన్‌రెడ్డి.. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ సభా పక్ష నేతగా కొనసాగుతున్నారు. ఆయన పదవి కాలం మార్చి 29తో ముగియనుంది. ఇటీవల జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనూ ఈ సీటుకు జీవన్‌రెడ్డినే అభ్యర్థిగా అధిష్ఠానానికి ప్రతిపాదించాలన్న నిర్ణయం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ సీటును గెలుచుకునేందుకు అభ్యర్థి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది.
జీవన్‌రెడ్డి ఆర్థిక స్థోమతను బట్టి పెద్ద మొత్తంలో వెచ్చించలేరనే భావనతో ఇతరుల పేర్లు పరిశీలిస్తున్నారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, పార్టీ నేతలు ప్రసన్న హరికృష్ణ, వెల్చాల రాజేందర్‌రావు, మాజీ డీఎస్పీ గంగాధర్ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాల స్థానిక నాయకత్వాలను సంప్రదించిన తర్వాత అధిష్ఠానానికి టీపీసీసీ ప్రతిపాదన పంపనుంది. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కానుందని, అధిష్ఠానం.. అభ్యర్థిని ఖరారు చేసి ప్రకటించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి మిత్రపక్ష పార్టీలకు చెందిన టీచర్ యూనియన్‌ల అభ్యర్థులకు మద్దతివ్వాలన్న యోచన చేస్తున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్నదానిపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ తెలిపారు.