Supreme Court Party Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు.. సుప్రీం ఏం చెప్పిందంటే
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:20 AM
Supreme Court Party Defection Case: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంలో విచారణ కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి వినిపిస్తున్నారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీం కోర్టులో (Supreme Court) ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. గత విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.
ప్రస్తుతం స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు ప్రారంభించారు. స్పీకర్ విశేషాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని.. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉందన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. అక్కడ కేసు పెండింగ్‌లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముకుల్ రోహత్గి వాదనలు గతంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఉందని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని ముకుల్ రోహత్గి వాదించారు.
దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నిస్తూ.. స్పీకర్ ఐదేళ్ల వరకూ నిర్ణయం తీసుకోకపోతే అంతవరకూ కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని అడిగారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని ముకుల్ రోహత్గి తెలిపారు. అయితే స్పీకర్‌కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ణప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ముకుల్‌ను జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు.
ఫిరాయింపులపై పిటీషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని.. 18.03.2024న పిటీషనర్లు స్పీకర్‌కు విజ్ణప్తి చేశారని రోహత్గి తెలిపారు. 16.01.2025న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారని.. స్పీకర్ తన విధులను నిర్వర్తిస్తున్నారని వాదించారు. స్పీకర్‌పై నమ్మకం లేక రిట్‌ల పైన రిట్‌లు దాఖలు చేయడం ఎందుకు?...స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకూ ఎందుకు పిటీషనర్లు ఆగరని సీనియర్ న్యాయవాది ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే కోర్టులో పిటిషన్ వేశారని కోర్టుకు తెలిపారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు. సింగిల్ జడ్జి బెంచ్ నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయాలని చెప్పిందని.. ఆ ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసిందని తెలిపారు. రాణా కేసుతో ఈ కేసును ముడి పెడుతున్నారని.. అది ఏమాత్రం సమంజసం కాదని.. రాణా కేసు పూర్తిగా భిన్నమైన వ్యవహారమని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
రోహత్గి వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. స్పీకర్ చర్య తీసుకోకపోతే.. నాలుగురు సంవత్సరాలు స్పీకర్ ఏమీ చేయకపోతే, కోర్టులు చూసూ ఉండాల్సిందేనా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
Rice: సన్నబియ్యం కోసం సందెవేళలోనూ..
Ameenpur Case Twist: అమీన్‌పూర్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం
Read Latest Telangana News And Telugu News