Karimnagar: లక్ష్యసాధనకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:15 AM
కరీంనగర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సెర్ప్ లక్ష్య సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు.

- నవంబర్ వరకు జిల్లా సమైక్య భవనాలు పూర్తి కావాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి లోకేష్‌కుమార్
కరీంనగర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సెర్ప్ లక్ష్య సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సెర్ప్ కార్యక్రమాలపై సీఈవో డి దివ్యతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో సెర్ప్ ద్వారా ఏర్పాటు చేయనున్న ఐకేపి కొనుగోలు కేంద్రాలను పెంచేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సామాగ్రి అందించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ అందించాలని, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు కమీషన్ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వశక్తి మహిళా సంఘాలతో రైసు మిల్లుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. పౌరసరఫరాల శాఖ, సెర్ప్ సమన్వయంతో ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి దివ్యాంగులకు నిర్దారణ పరీక్షల నిర్వహణ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. నిర్ధారణ శిబిరాల నిర్వహణకు ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రాతిపాదనలను పంపించాలని కలెక్టర్లకు సూచించారు. కుటుంబంలో వృద్దాప్య పింఛన్ పొందుతున్న వృద్దులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఈసారి జిల్లాలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను 150 వరకు పెంచనున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యూడీఐడీ కార్డుల మంజూరు ప్రక్రియలో భాగంగా దివ్యాంగులను నిర్ధారించేందుకు ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీధర్ పాల్గొన్నారు.