రాజన్న ఆలయంలో ఉగాది వేడుకలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:09 AM
వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు రాజరాజేశ్వరస్వామి వారితో పాటుగా అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక పూజలు చేశారు.

- స్వామి వారికి ప్రత్యేక పూజలు
వేములవాడ కల్చరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు రాజరాజేశ్వరస్వామి వారితో పాటుగా అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక పూజలు చేశారు. నూతన పంచాంగ పుస్తకాలను ఽస్వామి వారి చెంతవుంచి పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయ పరిసరాలను పూలతో అందంగా అలంకరించారు.
- భక్తుల రద్దీ..
ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు లక్ష్మీగణపతి, రాజన్నను, పార్వతిదేవి అమ్మవారిని దర్శించుకుని తరించారు. అనుబంధ ఆలయాల్లో అనంతపద్మనాభస్వామి, సీతరామచంద్రస్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొని తరించారు.
- రాజన్న అర్చకులకు ఉగాది పురస్కారాలు..
వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వర్తించే అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందించింది. విశ్వావసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం ఆయా దేవాలయాల అర్చకులను రవీంద్రభారతిలో సన్మానించింది. రాజన్న ఆలయం ఉపప్రధాన అర్చకుడు వెంకన్న, వేద పారాయణదారు జగన్మోహన్‌ను దేవదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజరామయ్యర్, దేవదాయశాఖ కమిషనర్ శ్రీధర్ శాలువతో సత్కరించి సన్మానించారు.
- వైభవంగా స్వామివారి రథోత్సవం
వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను అంబారి సేవపై పట్టణ వీధులగుండా ఊరేగించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.