ఆస్తి పన్ను బకాయిలపై దృష్టి
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:58 AM
ఆస్తిపన్ను బకాయిదారులపై నగరపాలక సంస్థ కొరఢా ఝళిపిస్తోంది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ బకాయిదారుల ఇళ్లు, కార్యాలయాలకు వెళ్లి ఆస్తిపన్ను వసూలు చేశారు.

- రెవెన్యూ గార్డెన్, రెవెన్యూ క్లబ్ సీజ్
- కొరడి ఝళిపిస్తున్న బల్దియా
- నేటితో ముగియనున్న వడ్డీ మాఫీ
కరీంనగర్ టౌన్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఆస్తిపన్ను బకాయిదారులపై నగరపాలక సంస్థ కొరఢా ఝళిపిస్తోంది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ బకాయిదారుల ఇళ్లు, కార్యాలయాలకు వెళ్లి ఆస్తిపన్ను వసూలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిలను వన్ టైం సెటిల్‌మెంట్ స్కీం కింద ఒకేసారి చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మార్చి 31లోగా ఆస్తిపన్ను బకాయిలను ఒకేసారి చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బకాయిలను చెల్లించాలంటూ మున్సిపల్ అధికారులు బకాయిదారులపై ఒత్తిడి తెస్తున్నారు.
నల్లా కనెక్షన్ల తొలగింపు, ఆస్తుల జప్తు
బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేయడంతోపాటు ఆ ఇంటికి సంబంధించిన బకాయిలు ఇన్ని ఉన్నాయంటూ ఇళ్ల ఎదుట నోటీసును అతికించారు. అయినా బకాయిలను చెల్లించకుంటే నోటీసులు ఇచ్చిన ఇళ్లకు వెళ్లి నల్లాలు తొలగిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇళ్లకు నల్లా కనెక్షన్లను తొలగించారు. 50వేలకు పైన బకాయిలు ఉన్న ఇంటి యజమానుల ఆస్తులను జప్తు చేయడంతోపాటు థియేటర్లు, వివిధ సంస్థలకు చెందిన కార్యాలయాలకు తాళాలు వేసి సీజ్ చేస్తున్నారు. ఆదివారం ఆస్తిపన్ను బకాయిలు చెల్లించక పోవడంతో కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్, రెవెన్యూ క్లబ్‌లకు తాళం వేసి సీజ్ చేశారు. ఈ రెండింటికి సంబంధించి 87 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి.
కరీంనగర్ నగరపాలక సంస ఈఈ రొడ్డ యాదగిరిని ఆస్తిపన్ను బకాయిలను చెల్లించాలని లేనిపక్షంలో ఆస్తులను జప్తు చేస్తామంటూ హెచ్చరిస్తూ ఫోన్ చేశారు. ఆదివారం రాత్రి ఆయన ఇంటికి డిజాస్టర్ వెహికిల్‌ను పంపించి ఆస్తి జప్తు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఈఈ యాదగిరి మాట్లాడుతూ 2025 మార్చి 31 వరకు తాను హౌసింగ్‌బోర్డుకాలనీలోని తన ఇంటికి సంబంధించిన ఆస్తిపన్నులను చెల్లించాలని, 2022 సంవత్సరానికి ముందు బకాయిలున్నాయంటూ తన ఆస్తులను జప్తు చేసేందుకు సిబ్బందిని ఎలా పంపిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, ఎంతో మంది ఆస్తిపన్నులు బకాయిలు ఉంటే వారి ఆస్తులను సీజ్ చేయడం లేదన్నారు. 2022కు ముందు పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేయడం తనపై వివక్ష చూపడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 34వ డివిజన్ గోదాంగడ్డ ఏరియా హనుమాన్ దేవాలయ సమీపంలో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని అడిగిన వార్డు అధికారి, సపోర్టింగ్ ఉద్యోగిపై అంథోని అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. సపోర్టింగ్ ఉద్యోగిపై దాడిచేసి ఆయన మోటార్ బైక్‌ను ధ్వంసం చేయడంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉద్యోగులతో దురుసుగా వ్యవహరిస్తే కఠినచర్యలు
నగరపాలక సం్థస కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
ఆస్తిపన్ను బకాయిల వసూళ్లకు వెళ్లిన మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తే చట్టం ప్రకారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ హెచ్చరించారు. బకాయిదారులు గడువులోగా పన్నులు చెల్లించి 90 శాతం వడ్డీ మాఫీని వినియోగించుకోవాలని కోరారు.