Share News

పెద్దపల్లి బస్‌ డిపో ఏర్పాటుకు సన్నాహాలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:51 AM

పెద్దపల్లిలో ఆర్టీసీ బస్‌ డిపో నిర్మాణానికి ఆ సంస్థ సన్నాహాలు మొదలుపెట్టింది.

పెద్దపల్లి బస్‌ డిపో ఏర్పాటుకు సన్నాహాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లిలో ఆర్టీసీ బస్‌ డిపో నిర్మాణానికి ఆ సంస్థ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈనెల 17వ తేదీన ములుగు జిల్లా ఏటూరునాగారంతోపాటు పెద్దపల్లి బస్‌ డిపో నిర్మాణానికి, ఇతర పనులకు తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ సివిల్‌ ఇంజినీర్‌ టెండర్లను ఆహ్వానించారు. పెద్దపల్లి బస్‌ డిపో నిర్మాణానికి 8 కోట్ల 40 లక్షల రూపాయలు ఆర్టీసీ మంజూరు చేసింది. ఈ నిధులతో కేటాయించిన స్థలంలో గల వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలను కూల్చి వేయడంతో పాటు బస్సులకు మరమ్మతులు చేసేందుకుగాను ఒక షెడ్డు, డిపో చుట్టూ ప్రహారి నిర్మాణం ఇతర సివిల్‌ పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేం దుకు గడువు విధించారు. అదే నెల 22వ తేదీన టెం డర్లను తెరిచి ఖరారు చేయనున్నారు. ఒప్పందాలు పూర్తయిన తర్వాత మే నెలలో డిపో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

డిపో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు..

పెద్దపల్లి బస్‌ డిపో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతూ వచ్చింది. జిల్లాలోని కాల్వశ్రీరాం పూర్‌ మండలంలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. ఫ్యాక్టరీకి భూమి పూజ అనంతరం రైతులతో నిర్వహించిన అవగాహన సదస్సులో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లిలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల చిరకాల వాంఛను నెర వేర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఆయన ఇదే సభావేదికగా సీఎం దృష్టికి తీసుకవెళ్లి ఏడాది వరకు పెద్దపల్లిలో బస్‌ డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా ఎమ్మెల్యే బస్‌ డిపో మంజూరు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి విన్నవించారు. డిపో ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

సెప్టెంబర్‌లో స్థల పరిశీలన

సెప్టెంబర్‌లో స్థల పరిశీలన మొదలుపెట్టారు. మొదట మంథని రోడ్డులో గల రాఘవాపూర్‌లో ప్రభు త్వ భూములు ఉండడంతో అక్కడి డిపో నిర్మాణానికి ప్రతిపాదించారు. ఆ స్థలం బస్టాండ్‌ నుంచి 5 కిలోమీ టర్ల దూరం ఉండడంతో ఆర్టీసీ అధికారులు నిబంధనల ప్రకారం బస్టాండ్‌కు డిపో 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని, ఆ స్థలంలో డిపో ఏర్పాటు చేయడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో బస్టాండ్‌ పక్కనే గల ఎంపీడీవో, విద్యా శాఖ కార్యాలయం, పంచాయతీరాజ్‌ శాఖ, క్వాలిటీ కాంట్రోల్‌ కార్యాలయం, ఐకేపీ భవనం, టాస్క్‌ కేంద్రం, పౌరసరఫరాల గోదాం గల 4.31 ఎక రాల స్థలాన్ని ప్రతిపాదించారు. ఈ స్థలం ఆర్టీసీకి ఇచ్చేందుకు కలెక్టర్‌ ముందుకు వచ్చారు. మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ.14 కోట్ల రెవెన్యూ శాఖకు చెల్లించాలని కలెక్టర్‌ ఆర్టీసీ అధికారులకు లేఖ పంపారు. అంత సొమ్ము చెల్లించేందుకు ఆర్టీసీ సుము ఖత వ్యక్తం చేయలేదు. డిసెంబర్‌ 4న పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం సీఎం సభకు ముందు రోజు పెద్దపల్లిలో ఆర్టీసీ డిపోను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా స్థలాన్ని అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. ఆ స్థలంలో ఉన్న కార్యాలయాలను జనవరి మొదటి వారంలో తరలించారు. స్థలాన్ని పరిశీలించిన ఆర్టీసీ అధికారులు డిపో కార్యాలయానికి అందులో గల టాస్క్‌ కేంద్రం, ఐకేపీ భవనాలను సద్వినియోగం చేసు కోవడంతోపాటు, బస్సుల రిపేర్‌ కోసం పౌరసరఫరాల గోదాంను వాడుకోవాలని భావిస్తున్నారు. డిపో నిర్మాణ పనులు మే నెలలో ఆరంభిస్తే, డిపో దసరా లేదా దీపావళి నాటికి ప్రారంభించే అవకాశాలున్నాయి.

Updated Date - Mar 28 , 2025 | 12:52 AM