ముగిసిన శివకల్యాణోత్సవం
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:05 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన శివకల్యాణోత్సవ వేడుకలు గురువారం ముగిశాయి.

వేములవాడ కల్చరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన శివకల్యాణోత్సవ వేడుకలు గురువారం ముగిశాయి. రాజన్న ఆలయంలో ఆలయ అర్చకులు ఉదయం 6.30 గంటలకు తీర్థరాజ స్వామి పూజ, ఔపాసనం-బలిహరణం ఘనంగా నిర్వహించారు. శేషహోమాలు జయాదులు, పూర్ణహుతి, యాగ మంటప దేవతోత్వాసనాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జంగమ పూజారులు శరభ గజ్జల కార్యక్రమాన్ని నిర్వహించి పల్లకి సేవాను నిర్వహించారు.
కన్నుల పండువగా త్రిశూలయాత్ర..
వేములవాడ రాజన్న ఆలయంలో గురువారం ఉదయం అద్దాల మండపంలో నాకబలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గుమ్మడికాయలను కత్తితో కొట్టి పూజ కార్యక్రమాలను చేపట్టారు. ఆలయంలో నిర్వహించిన త్రిశూల యాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు త్రిశూలానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి స్వామివారి ధర్మగుండంలో చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కాగా, హోమం కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు.