Share News

నాలుగేళ్లుగా ఊరించుడే..!

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:41 AM

సాదాబైనామాల సమస్య తీరుస్తామని నాలుగేండ్లుగా పాలకవర్గాల పెద్దలు ఊరిస్తూనే ఉన్నారు. ధరణి ప్రవేశపెట్టిన సమయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదాబైనామాలను ముందుకు తీసుకవచ్చి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించింది.

నాలుగేళ్లుగా ఊరించుడే..!

- భూభారతి కోసం ఎదురుచూపులు

- సాదాబైనామాల నిరీక్షణకు ఉపశమనం

- జిల్లా వ్యాప్తంగా 15 వేల దరఖాస్తులు

- అమల్లోకి రానున్న ఆర్వోఆర్‌-24 చట్టం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సాదాబైనామాల సమస్య తీరుస్తామని నాలుగేండ్లుగా పాలకవర్గాల పెద్దలు ఊరిస్తూనే ఉన్నారు. ధరణి ప్రవేశపెట్టిన సమయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదాబైనామాలను ముందుకు తీసుకవచ్చి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించింది. ఆ తరువాత దీనిపై ఉత్తర్వులు రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ధరణిలో ఉన్న లోపాలను సవరిస్తూ భూభారతిని తీసుకవస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో సాదాబైనామాల క్రమబద్ధీకరణ జరుగుతుందని ప్రకటించారు. సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అర్హులు, అనర్హులపై ఆరాలు తీశారు. కానీ సాదాబైనామాల కోసం నాలుగేండ్లుగా ఆశలు మాత్రం తీరడం లేదు. తెల్ల కాగితాలపై క్రయవిక్రయాలు జరిపిన భూములకు సంబంధించి రికార్డుల లేక పట్టాదారులుగా గుర్తించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు దూరమవుతూ వస్తున్నారు. దాదాపు పదేండ్లుగా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్న వారికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకవచ్చిన తెలంగాణ భూ భారతి బిల్లు కూడా రైతులను పరీక్షిస్తూనే ఉంది.

ఫ 15 వేల సాదాబైనామాలకు మోక్షమెప్పుడో..?

సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించి క్రమబద్ధీకరిస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. 2014 జూన్‌ 2లోపు సాదాబైనామాల ద్వారా భూ విక్రయాలు జరిపిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు తీసుకున్నా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెల్లకాగితం ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ భూ భారతి బిల్లు-2024 ద్వారా సాదాబైనామాలతో క్రమబద్ధీకరణకు భూ భారతి పోర్టల్‌ ద్వారా రైతులందరికి పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని నిర్ణయించారు. ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ చేసి అర్హత ఉన్న దరఖాస్తులను పరిశీలించనున్నారు. మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రైతుల్లో ఆసక్తి నెలకొన్నా సమస్యలకు పరిష్కారం లభించలేదు. గత ప్రభుత్వం 2020 సంవత్సరం నవంబరు వరకు సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మీ సేవా ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో సిరిసిల్ల మండలంలో 428, వేమువాడ మండలంలో 675, వేములవాడ రూరల్‌లో 1072, ఎల్లారెడ్డిపేటలో 1227, తంగళ్లపల్లిలో 1776, ముస్తాబాద్‌లో 1685, గంభీరావుపేటలో 1403, చందుర్తిలో 1259, బోయినపల్లిలో 764, కోనరావుపేటలో 2690, రుద్రంగిలో 162, వీర్నపల్లిలో 379 మంది దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్రమబద్ధీకరించే చర్యలు మాత్రం జరగలేదు. గత ప్రభుత్వం 2020 అక్టోబరు 24న ధరణి పోర్టల్‌ తీసుకరాగా, నవంబరు 2 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ అనేక ఇబ్బందుల మధ్య ధరణి కొనసాగింది. ఇందులో సాదాబైనామాలకు మోక్షం కలగలేదు.

ఫ సంక్షేమ పథకాలు దూరం..

సాదాబైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించి పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయాల్సి ఉండగా, వివిధ కారణాలతో గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కోర్టులో దాఖలైన పిటిషన్లకు గత ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతోనే పరిష్కారం లభించలేదు. దీంతో రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు దూరమయ్యారు. రైతు బంధు, రైతు బీమా, బ్యాంకురుణాలు, రుణమాఫీ వంటి పథకాలను అందుకోలేకపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, ఫసల్‌బీమా వంటివి అందించే దిశగానే సాదాబైనామాలను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగానే ఆర్వోఆర్‌-2024 చట్టం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయనున్నారు. కొత్త చట్టంతో కలెక్టర్‌తో నిమిత్తం లేకుండా తహసీల్దార్లు, ఆర్డీవోలకే అధికారాలు కేటాయించనున్నారు. మ్యూటేషన్‌, చట్టబద్ధ హక్కుల నమోదు, భూసమస్యలకు శాశ్వత పరిష్కారం, భూ రికార్డుల సవరణ, సాదాబైనామా, ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌ దరఖాస్తులకు సంబంధించిన అంశాలు ఆర్డీవో పరిధిలో, విరాసత్‌తో పాటు మరికొన్ని తహసీల్లార్లకు అప్పగించనున్నారు. దీంతో వేగంగా సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని ఎదురుచూస్తున్న రైతులకు ఎప్పుడు ఊరట కలుగుతుందో వేచిచూడాలి.

Updated Date - Mar 22 , 2025 | 12:41 AM