Hyderabad: రూ.1090 కోట్ల పనులకు మూడు సంస్థల బిడ్లు!
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:33 AM
రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వం చేపట్టిన ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)’ ప్రాజెక్టుల్లో కీలక అడుగు పడింది. కేబీఆర్ పార్కు చుట్టూ స్టీల్ వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణానికి మూడు సంస్థలు ముందుకు వచ్చాయి.

కేబీఆర్ పార్కు చుట్టూ రెండు ప్యాకేజీలుగా పనులు
హైదరాబాద్ సిటీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వం చేపట్టిన ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)’ ప్రాజెక్టుల్లో కీలక అడుగు పడింది. కేబీఆర్ పార్కు చుట్టూ స్టీల్ వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణానికి మూడు సంస్థలు ముందుకు వచ్చాయి. రూ.580 కోట్లతో ప్యాకేజీ-1లో భాగంగా జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్కు ప్రవేశ ద్వారం, ముగ్ద జంక్షన్ల వద్ద; రూ.510 కోట్లతో ప్యాకేజీ-2లో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబరు-45, ఫిల్మ్‌నగర్, మహారాజ అగ్రసేన్, క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్ల వద్ద ప్రాజెక్టుల కోసం ఫిబ్రవరి 22న జీహెచ్‌ఎంసీ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. బుధవారం సాయంత్రం గడువు ముగియగా.. బల్దియా అధికారులు టెండర్ బాక్స్ తెరిచారు. ఎం.వెంకట్‌రావు(ఎంవీఆర్), మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ(ఎన్‌సీసీ) బిడ్ వేశాయి.
సాంకేతిక, ప్రైస్ బిడ్ పరిశీలన ప్రారంభమైంది. కాగా, సాంకేతికంగా ఆయా సంస్థలకు ప్రాజెక్టులు నిర్మించే అర్హత ఉందా..? అన్నది మొదట పరిశీలించనున్నారు. అనంతరం అర్హత ఉన్న సంస్థల్లో తక్కువ కోట్ చేసిన రెండు సంస్థలను ఎంపిక చేసి.. కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)కు పంపుతారు. సీవోటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వివరాలు ప్రభుత్వానికి వెళ్తాయి. సర్కారు ఆమోదం అనంతరం ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలన్నర నుంచి రెండు నెలలు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ లోపు పార్కు చుట్టూ ఆస్తుల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.