Share News

Inter: ఇంటర్‌ విద్య.. మరింత ముందుకు

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:33 PM

inter classes beginng రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థుల భవితకు బంగారుబాటలు వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ స్థాయిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

Inter: ఇంటర్‌ విద్య.. మరింత ముందుకు
హిరమండలం : కేజీబీవీలో ఇంటర్‌ విద్యార్థినులు

  • నేటి నుంచి ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం

  • సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు

  • 7 నుంచి ప్రథమ సంవత్సర ప్రవేశాలకు అడ్మిషన్లు

  • హిరమండలం/ సోంపేట, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థుల భవితకు బంగారుబాటలు వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ స్థాయిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా మంగళవారం (ఏప్రిల్‌ 1) నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తరగతులను ప్రారంభించనుంది. ఏప్రిల్‌ 7 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్లు నిర్వహించనుంది. ఏప్రిల్‌ 23 వరకు తరగతులు నిర్వహించి.. 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనుంది. జూన్‌ 1 నుంచి విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుంది. వచ్చే ఫిబ్రవరిలోనే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. కళాశాలల పనిదినాలను 222 నుంచి 235కి పెంచింది. దీంతో ఇంటర్‌ విద్య మరింత ముందుకు వచ్చి.. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

  • ఉచితంగా పుస్తకాలు

    జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 38, మోడల్‌ స్కూల్‌లో కళాశాలలు 13, కస్తూరిబాయి జూనియర్‌ కళాశాలలు 25, సాంఘిక, గిరిజన సంక్షేమ కళాశాలలు 10 ఉన్నాయి. వీటితో పాటు ప్లస్‌-1 కళాశాలలు 6, మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల కళాశాల -1 కలిపి మొత్తం 93 కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి వీటన్నింటిలో నూతన విద్యావిధానం ద్వారా తరగతులు బోధించనున్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సీబీఎస్‌ఈ పుస్తకాలను ప్రభుత్వ ఉచితంగా అందించనుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వాటితోపాటు నోటుపుస్తకాలు, రికార్డు షీట్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం రోజుకు ఏడు పీరియడ్లు ఉండగా.. ఇకపై ఎనిమిది పీరియడ్లు ఉండేలా టైమ్‌టేబుల్‌ విడుదల చేశారు. మొత్తం సిలబస్‌ను డిసెంబరు 31వ తేదీ కంటే ముందే పూర్తి చేసి రివిజన్‌ ప్రారంభిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో సైన్స్‌ గ్రూపు విద్యార్థులకు జేఈఈ, ఎంసెట్‌లకు కూడా శిక్షణ ఇస్తారు.

  • పదో తరగతి విద్యార్థులకు సెమిస్టర్‌ విధానంలో పుస్తకాల ఏర్పాటు తరహాలోనే ఇంటర్‌ విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ర్టీ కలిపి ఒక పుస్తకం, బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మరో పుస్తకం, గణితం1ఏ, 1బి కలిపి ఒకే పుస్తకంగా రూపొందించారు. కొత్తగా ఎంబైపీసీ సైతం ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, బైపీసీ విద్యార్థులు గణితం చదవవచ్చు. ఈ కోర్సు చేసినవారు ఇంజనీరింగ్‌ లేదా వైద్యవిద్య వైపు వెళ్లవచ్చు. వీటితో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, ప్రాక్టికల్‌ పరికరాలు అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ద్వితీయ విద్యార్థులకు యథావిధిగా పాత సిలబస్‌లోనే పాఠ్యాంశాలు బోధించనున్నారు. ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్‌ నెలాఖరులోగా పుస్తకాలు అందజేస్తారు. ఇంటర్‌లో కొత్త విద్యావిధానం వలన కార్పొరేట్‌తో పోటీపడేలా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందకు వీలుంటుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:33 PM