Waste Management: చెత్త.. కంపు!
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:37 PM
Municipal Waste మునిసిపాలిటీల్లో చెత్తనిల్వలు పేరుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం.. చెత్త నుంచి సంపద కేంద్రాలు తయారుచేయాలని ఆదేశించింది. అలాగే పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మునిసిపాలిటీల్లో పేరుకుపోతున ్న నిల్వలు
‘సంపద’ కోసం వేచిఉంటే వ్యాధుల ముప్పు
కొన్నింటిలో పారిశుధ్య కార్మికుల కొరత
అస్తవ్యస్తంగా మురుగు కాలువలు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
- పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ శ్రీనివాసనగర్‌లో పారిశుధ్యం దుస్థితి ఇది(పై చిత్రం). రోడ్డుకిరువైపులా ఇలా చెత్త దర్శనమివ్వడంతో అటువైపుగా వెళ్లిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోజూ ఇక్కడ పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే 11వ వార్డు పరిధి పూజారివీధిలోని రాధాకాంత్ కోనేరులో చెత్త, పూడిక పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని వాపోతున్నారు.
పలాస/ కాశీబుగ్గ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో చెత్తనిల్వలు పేరుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం.. చెత్త నుంచి సంపద కేంద్రాలు తయారుచేయాలని ఆదేశించింది. అలాగే పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. ప్రతీ నెలా మూడో శనివారం ప్రతి ఒక్క ఉద్యోగి పారిశుధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, ప్రజలు మన్ననలు పొందాలని సూచించింది. పాస్టిక్ వినియోగాన్ని తగ్గించి.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పేర్కొంది. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధించింది. నిషేదాజ్ఞలు పాటించకపోతే జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. కానీ ఇది ఆచరణలో సాధ్యమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిషేధం విధించినా ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూనే ఉంది. జిల్లాలో ఎక్కడికక్కడ చెత్త నిల్వలు దర్శనమిస్తూనే ఉన్నాయి. దీనిపై అధికారులకు చిత్తశుద్ధి కరువవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మునిసిపాలిటీలు ఉన్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో టన్నుల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను పారబోయడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం పురపాలక సంఘాల్లో టన్నుల కొద్దీ చెత్త నిల్వ ఉండిపోతోంది. కాలువల్లో చెత్త అధికంగా పేరుకుపోతోంది. ఈ చెత్తను బయటకు తీసినా ఎక్కడ పారబోయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాలువలు శుభ్రం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల నిధులు వెచ్చించినా తగిన ప్రణాళిక లేకపోవడంతో వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి ఉంది.
సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించిన తరువాత తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తను మూడు విభాగాలుగా వేరు చేయాలి. వాటి నుంచి వర్మీ కంపోస్టు, సంప్రదాయ ఎరువులు తయారు చేసి రైతులకు అందించాలి. కానీ జిల్లాలో డంపింగ్ యార్డులు చాలినంతగా లేవు. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు తగిన సాంకేతిక సిబ్బంది నియామకం లేదు. చెత్త నుంచి వచ్చే ఎరువులు మార్కెటింగ్ చేయడానికి అనువైన వాతావరణం లేదు. సేకరించిన చెత్త ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఇంటింటా సేకరించిన చెత్త డంపింగ్‌యార్డులకు తరలిస్తూ నెల తరువాత వాటిని కాల్చి బూడిద చేస్తున్నారు. దీనివల్ల కాలుష్యం నుంచి తమను కాపాడాలంటూ ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నారు.
పలాస వంటి మునిసిపాలిటీలో పది ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఉన్నా, సిబ్బంది లేని కారణంగా చెత్తను పారబోయడం తప్ప.. సంపదపై దృష్టి సారించలేక పోతున్నారు. అదనంగా ప్రతి మున్సిపాలిటిలో చెత్త నుంచి సంపద సృష్టించడం కోసం పది మంది సిబ్బందిని నియమిస్తే కొంతవరకూ ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఆరంభంలోనే చెత్తసంపద సృష్టి అవరోధాల పాలవుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చెత్తపై కఠినమైన నిబంధనలు అమలు చేయడం, సేకరించిన చెత్తను క్రమపద్ధతిలో వినియోగించకపోతే భవిష్యత్‌లో మునిసిపాలిటీలన్నీ మురికిపాలిటీలుగా మారుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
శిథిలావస్థలో కాలువలు
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఆదాయ పరంగా మెరుగ్గా ఉన్నా, వసతుల విషయంలో మాత్రం వెనుకబాటే. ప్రధానంగా కాలువలు, పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉంది. ప్రధాన రహదారులు, జంక్షన్లు తప్ప.. శివారు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను విస్మరిస్తున్నారు. చాలాచోట్ల కాలువల్లో చెత్త, సీసాలు, వాడి పడేసిన కొబ్బరి బోండాలు దర్శనమిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల కిందట నిర్మించిన మురుగు కాలువలే ఇప్పటికీ ఆధారం. చిన్నపాటి వర్షానికే కాలువలు పొంగి ప్రవహిస్తుంటాయి. పాత జాతీయ రహదారి వద్ద కాలువ శిఽథిలావస్థకు చేరుకుంది. పోస్టాఫీసు వద్ద రోడ్డు కోతకు గురైంది. వర్షం వస్తే ఆ ప్రాంతం చిన్నపాటి చెరువును తలపిస్తుంది. గతేడాది ఇళ్లలోకి నీరు చేరింది. వైసీపీ హయాంలో మునిసిపాలిటీలో రహదారి విస్తరణ పనులు అస్తవ్యస్తంగా చేపట్టారన్న విమర్శలున్నాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో కాలువల పనులు సరిగ్గా చేపట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కార్మికుల కొరతతో ఇక్కట్లు
ఆమదాలవలస, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస పురపాలక సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నా.. పారిశుధ్య నిర్వహణపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మునిసిపాలిటీలో ప్రధానంగా పారిశుధ్య కార్మికుల కొరత కనిపిస్తోంది. 23 వార్డుల పరిధిలో సుమారు 90మంది కార్మికులు అవసరం కాగా.. ప్రస్తుతం రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో 57 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఇంటింటా చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. మునిసిపాలిటీ చెత్తను ఒకటో వార్డులోని జగ్గుశాస్ర్తులపేటలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు రోజూ తరలించాలి. కాగా ప్రస్తుతం మూడు ట్రాక్టర్లు, ఒక కంపార్ట్ వాహనం మాత్రమే ఉండడంతో చెత్త తరలింపు సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. పట్టణంలో సేకరించిన చెత్తను లక్ష్మీనగర్ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు గట్టుపై వేస్తున్నారు. పట్టణానికి దూరంగా ఉన్న ఒకటి, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు వార్డులకు చెత్త సేకరణ కోసం వాహనాలు వెళ్లాలంటే కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా సాగేలా చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాం
చెత్తను వినియోగించడానికి చర్యలు తీసుకుంటాం. కాలువల్లో చెత్తను తీయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే వార్డులను విభజించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాం. కొద్ది రోజుల్లో ఈ సమస్య తీరిపోతుంది. డంపింగ్ యార్డుల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం.
ఎన్.రామారావు, మునిసిపల్ కమిషనర్, పలాస-కాశీబుగ్గ
మునిసిపాలిటీల్లో రోజువారీ చెత్త ఉత్పత్తి (టన్నుల్లో)
--------------------------------------------------
ఇచ్ఛాపురం 18
పలాస-కాశీబుగ్గ 28
ఆమదాలవలస 13
శ్రీకాకుళం 62.5