Formula-E Case: ఒంటరిగా రావాల్సిందే..
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:56 AM
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదులతో కలిసి వెళ్లిన బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను పోలీ్‌సలు ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించలేదు.
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ ఝలక్
విచారణకు న్యాయవాదులతో వచ్చిన కేటీఆర్
బృందాన్ని లోపలికి అనుమతించని ఏసీబీ
బయట 40 నిమిషాల హైడ్రామా
ఏసీబీకి లేఖ ఇచ్చి వెనుదిరిగిన బీఆర్‌ఎస్ నేత
9న రావాలని కేటీఆర్‌కు మరోసారి నోటీస్
పోలీ్‌సలపై నమ్మకం లేకే లాయర్లతో వచ్చా
ఏసీబీ సోదాల పేరుతో నా ఇంట్లో ఏవో
వస్తువులు పెట్టేందుకు రేవంత్ కుట్ర: కేటీఆర్
నేడు జరగాల్సిన ఈడీ విచారణ వాయిదా
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు న్యాయవాదులతో కలిసి వెళ్లిన బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను పోలీ్‌సలు ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో ఏసీబీ ప్రధాన కార్యాలయం సమీపంలో కొంత హైడ్రామా చోటు చేసుకుంది. న్యాయవాదులు వెంట ఉంటే విచారణకు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. పోలీ్‌సలపై నమ్మకం లేకే న్యాయవాదులతో కలిసి వచ్చానని కేటీఆర్ బదులిచ్చారు. దాంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు న్యాయవాదులతో కలిసి విచారణకు అనుమతించేది లేదని ఏసీబీ నుంచి కచ్చితమైన ఆదేశాలు రావడంతో గేటు దగ్గర ఉన్న పోలీసులు కేటీఆర్‌కు అదే విషయాన్ని చెప్పారు. దాంతో ఆయన విచారణకు హాజరు కాకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. తాను చెప్పాలనుకున్నది లిఖిత పూర్వకంగా విచారణాధికారి పేరుతో తయారు చేసిన సమాధాన పత్రాన్ని అందజేసి వెళ్లిపోయారు.
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు ఇదివరకు నోటీ్‌సలు జారీ చేశారు. విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ న్యాయవాదులతో కలిసి సోమవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఏసీబీ కార్యాలయానికి సమీపంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసిన హైదరాబాద్ పోలీ్‌సలు కేటీఆర్ వాహనంలో న్యాయవాదులు ఉండటంతో లోపలికి అనుమతించలేదు. ఆయన ఒక్కరే లోపలికి వెళ్లాలని స్పష్టం చేశారు. న్యాయవాదులతో కలిసి వెళ్లనిస్తేనే ఏసీబీ అధికారుల ఎదుట హాజరవుతానని కేటీఆర్ బదులిచ్చారు. సిటీ పోలీసులు ఏసీబీ ఉన్నతాధికారులను సంప్రదిస్తుండగా, కేటీఆర్ తన వాహనంలోనే 40 నిమిషాల పాటు ఎదురు చూస్తూ కూర్చున్నారు. న్యాయవాదులతో కలిసి వచ్చేందుకు ఏసీబీ అనుమతి నిరాకరించడంతో తాను చెప్పదలుచుకున్న అంశాన్ని లిఖితపూర్వకంగా దర్యాప్తు అధికారి పేరుతో తయారు చేసిన సమాధాన పత్రాన్ని ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఏసీబీ అదనపు ఎస్పీ మాజిద్ ఖాన్‌కు అందజేసి వెనుదిరిగారు.
ఏం కావాలో అడగండి... సమయం ఇవ్వండి
ఈ కేసులో ఏసీబీకి ఏ పత్రాలు కావాలో స్పష్టంగా చెప్పి, తగిన సమయం ఇవ్వాలని దర్యాప్తు అధికారుల్ని కేటీఆర్ తన లేఖలో కోరారు. ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టులో సవాలు చేశానని, హైకోర్టు తీర్పును రిజర్వు చేసిందని చెప్పారు. ఈ కేసులో ఏసీబీ ప్రతివాదిగా ఉన్నారని, హైకోర్టు ఏ క్షణమైనా తీర్పును ప్రకటించే అవకాశం ఉందని ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీ తనకు నోటీసు ఇచ్చిందని గుర్తు చేశారు. కేసుకు సంబంధించిన సమాచారంతో పాటు, పత్రాలను అందివ్వాలని నోటీ్‌సల్లో పేర్కొన్నారని, ఏ అంశాలపైన సమాచారం కావాలో స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాకు న్యాయబద్ధంగా ఉన్న హక్కుల్ని కాపాడితే పూర్తిగా సహకరిస్తానన్నారు. హైకోర్టు తుది తీర్పు తర్వాత ఈ కేసులో ముందుకు వెళ్లాలని కోరారు.
9న రండి... ఒక్కరే రండి
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీ్‌సలు జారీ చేసింది. సోమవారం ఉదయం కేటీఆర్ ఉదంతం తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి,సాయంత్రం మరోసారి నోటీ్‌సలు జారీ చేశారు. గురువారం 9వ తేదీన విచారణకు రావాలని కోరారు. న్యాయవాదుల్ని అనుమతించేది లేదని అందులో స్పష్టం చేశారు.
నమ్మకం లేకే న్యాయవాదులతో వచ్చా..
ఏసీబీ అనుమతి కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పోలీ్‌సలపై నమ్మకం లేకనే న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చానన్నారు. చట్టాన్ని గౌరవించి ఏసీబీ కార్యాలయానికి వస్తే ప్రభుత్వం తన రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇలాగే విచారణ పేరుతో పిలిచి అసత్యాలతో కూడిన ప్రకటనను మీడియాకు వదిలారని ఆరోపించారు. తన వెంట న్యాయవాదులు ఉంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు తనకు లేదని ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాసివ్వాలని సవాలు విసిరారు. తనను విచారణ పేరుతో ఏసీబీ కార్యాలయంలో ఉంచి, తన ఇంటి పైన ఏసీబీ దాడులు నిర్వహించి, చట్ట వ్యతిరేకమైన వస్తువులు, పత్రాలు నా ఇంట్లో పెట్టి, సోదాల్లో పట్టుబడ్డాయని చెప్పించే కుట్ర రేవంత్‌రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
సోమవారం రోజు తన మామగారి రెండో సంవత్సరీకం పూజ జరుగుతోందని, ఆ సందర్భంగా సోదాలు చేస్తారనే సమాచారం తనకు ఉందని చెప్పారు. గతంలో దీపావళి చేసుకుంటుంటే కూడా పోలీసులతో సోదాలు చేయించారని వ్యాఖ్యానించారు. ఆ సోదాల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయని స్వయంగా శాసనసభ వేదికగా సీఎం అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయనందునే ధైర్యంగా ఏసీబీ విచారణకు వచ్చానన్నారు. రైతు భరోసాలో కోత ద్రోహం నుంచి రైతుల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఎన్ని ఎత్తుగడలకు పాల్పడ్డా 420 హామీలను అమలు చేేసదాకా వదిలిపెట్టేది లేదన్నారు. కేసులకు భయపడేది లేదని చెప్పారు. తాను ప్రభుత్వంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నానని, ఏసీబీ అధికారులు తనను అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉందన్నారు. లిఖిత పూర్వకంగా సమాధానం ఇద్దామనుకుంటే కనీసం లోపలికి అనుమతించలేదని చెప్పారు. రాజమౌళిని మించిన సినిమా కథలను పోలీసులు అల్లుతున్నారని ఎద్దేవా చేశారు.