వాయిదా పడ్డ షాపింగ్ కాంప్లెక్స్ వేలం
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:26 PM
ధన్వాడ పంచాయతీ కాంప్లెక్స్ వేలం వాగ్వాదాలు, గొడవల మధ్య ఎట్టకేలకు వాయిదా పడింది.

- నిజమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనం
- పంచాయతీ కార్యాలయంలో పోలీసు బందోబస్తు
- అధికారులతో దుకాణదారుల వాగ్వాదం
ధన్వాడ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ధన్వాడ పంచాయతీ కాంప్లెక్స్ వేలం వాగ్వాదాలు, గొడవల మధ్య ఎట్టకేలకు వాయిదా పడింది. షాపింగ్ కాంప్లెక్స్ అన్నింటికి వేలం వేస్తామని చెబుతూ కొన్నిరోజుల క్రితం పంచాయతీ అధికారులు దుకాణదారులకు నోటీసులు అందించారు. అయితే మంగళవారం పంచాయతీ కార్యాలయంలో వేలం పాట నిర్వ హించడానికి ఎంపీడీవో సాయిప్రకాష్, ఎంపీఈవో వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌రావులు సిద్ధం అయ్యారు. అయితే వేలం ను వాయిదా వేయాలంటు దుకాణదారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు, దుకాణా దారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసు కుంది. వేలం పాటను గుర్తించి దుకాణదారులు ఉదయమే కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. ముందుస్తుగానే కార్యాలయంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ‘ధన్వాడలో షాపింగ్ కాంప్లెక్స్ వేలం జరిగేనా..’ ‘వాయిదా పడనున్న వేలం’ అంటు రెండు రోజులుగా ‘ఆంధ్రజ్యోతి’లో వార్తా కథనాలు వచ్చాయి. చివరకు ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలే నిజం అయ్యాయి. అధికారులు వేలం పాటను వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వ హించేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడంతో వేలం పాటలో పాల్గొనడానికి వచ్చినవారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వేలం నిర్వ హిస్తామని ఎందుకు ప్రకటించారు.. ఇప్పుడెందుకు నిర్వహించరంటూ అధికారులను నిలదీశారు. వేలం వేయాలని డిపాజిట్ చేసిన వారు, ఎలా వేలం వేస్తారని ప్రస్తుతమున్న దుకాణదారులు కార్యాలయంలో గొడవకు దిగారు. చివరకు ఎస్‌ఐ రమేష్, పోలీసు సిబ్బంది కలుగ జేసుకొని ఆందోళనకారులను సముదాయించారు.