నిండుకుండలా మద్దికాన్ చెరువు
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:45 PM
ఏన్నో ఏళ్లుగా కరువుతో అల్లాడిన గ్రామాలకు మూడు పంటలు పండించుకొనే సాగు నీరు పుష్కలంగా అందుతుందంటే అది పాలకులు, అధికారుల పుణ్యమే అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- కేఎల్‌ఐ నీటితో కళకళలాడుతున్న గొలుసుకట్టు చెరువులు
భూత్పూర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ఏన్నో ఏళ్లుగా కరువుతో అల్లాడిన గ్రామాలకు మూడు పంటలు పండించుకొనే సాగు నీరు పుష్కలంగా అందుతుందంటే అది పాలకులు, అధికారుల పుణ్యమే అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మద్ధిగట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి 2018లో రైతులకు సాగునీరు కావాలని పట్టుపట్టాడు. ఆరు నెలలు కష్టపడి అనుకున్నది సాధించాడు. కేఎల్‌ఐ కెనాల్ ద్వారా గొలుసుకట్టు చెరువులకు నీరు అందించొచ్చు అని అధికారులు చెప్పడంతో రూ.70 లక్షలు ఖర్చు పెట్టి కాలువల ద్వారా (కమాలాద్ధిన్‌పూర్ బ్రాంచ్) మద్ధికాన్ చెరువుకు నీటిని తీసుకొచ్చారు. అప్పటి వరకు ఆ చెరువు 70 ఏళ్లుగా వట్టిపోయి ఉంది. ఒక్కసారిగా సాగునీరు రావడంతో రైతుల ఆనందాలకు ఆవధులు లేవు. అప్పటి నుంచి నేటికి చెరువు నిండు కుండలా నీటితో నిండి ఉంది. ఈ చెరువు కింద సుమారు 900 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతోంది. అదే విధంగా వెల్కిచర్ల, భట్టుపల్లి, పాతమొల్గర, కొత్తమొల్గర, కప్పెట, పోతులమడుగు వాగు మీదుగా మూసాపేట, అడ్డాకుల మండలాలతో పాటు దేవరకద్ర మండలంలోని కొన్ని గ్రామాలకు సుమారు 15 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మండలంలోని మద్ధిగట్ల, పాతమొల్గర, కొత్తమొల్గర, కప్పెట గ్రామాలు కోన సీమను తలిపించే విధంగా కళకళలాడుతున్నాయి.