Phone Tapping: నేడు సిట్ ముందుకు శ్రవణ్‌రావు
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:17 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం మీడియా సంస్థ యజమాని శ్రవణ్‌రావును మళ్లీ సిట్ ముందు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. వివిధ రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్‌కు ఇచ్చిన కారణం, ఈ ప్రక్రియలో ఆర్థిక లాభాలు పొందారా అనే అంశంపై శ్రవణ్‌రావు నుంచి స్పష్టమైన సమాధానాలను కోరినట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముఖాముఖి విచారణకు అవకాశం
గతంలో అరెస్టయిన పోలీసుకు నోటీసులు?
గత ప్రభుత్వ పెద్దలపైనే ఫోకస్!!
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంస్థ యజమాని శ్రవణ్‌రావు బుధవారం మళ్లీ సిట్ ముందు హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన విచారణలో ఆయన పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో.. మరోసారి రావాలంటూ దర్యాప్తు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పరారీలో ఉన్న ప్రభాకర్‌రావుతోపాటు ఇప్పటి వరకు అరెస్టయిన వారంతా పోలీసు అధికారులే..! శ్రవణ్‌రావు మాత్రమే ప్రైవేట్ వ్యక్తి. శ్రవణ్‌రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఎందుకు తలదూర్చారు? ఆయనను ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్ అధికారులకు పరిచయం చేసిందెవరు? ప్రణీత్‌రావు ఏకంగా శ్రవణ్‌రావు ఆఫీసులోనే హ్యాకింగ్ పరికరాలను ఏర్పాటు చేయడానికి కారణమేంటి? వీరంతా ఎంతమంది సంభాషణలను విన్నారు? అలా చేయడం వల్ల ఆర్థిక లబ్ధిపొందారా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులకు శ్రవణ్‌రావు నుంచి స్పష్టమైన సమాధానాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు, వారి అనుచరులు, రేవంత్ రెడ్డి సన్నిహితుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ టీంకు ఎందుకు ఇచ్చారు? ఆయా నంబర్లను శ్రవణ్‌రావుకు ఇచ్చిందెవరు? శ్రవణ్‌రావు గత ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు ఇచ్చిన సమాచారమేమిటి? అనే విషయాలను నిర్ధారించుకోవడానికి మరోసారి విచారణ తప్పలేదని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ కేసులో గతంలో అరెస్టు అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావులను ముఖాముఖి కూర్చోబెట్టి విచారించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం తనకు ప్రణీత్‌రావుతోనే పరిచయం ఉందని శ్రవణ్‌రావు చెబుతున్నప్పటికీ.. రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలకు ఆయన చేసిన ఫోన్‌కాల్స్, వాట్సాప్ చాట్‌లను పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలో వీరితో శ్రవణ్‌రావును ముఖాముఖి విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వీరికి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News