Share News

పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ ఘటన హైకోర్టుకు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:26 AM

నల్లగొండ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రం వాట్స్‌పలో ప్రత్యక్షమైన ఘటనలో డీబార్‌ అయిన విద్యార్థిని ఝాన్సీరాణి హైకోర్టును ఆశ్రయించింది.

పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ ఘటన హైకోర్టుకు

అన్యాయంగా డీబార్‌ చేశారని విద్యార్థిని వినతి

ఏప్రిల్‌ 7న కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు సూచన

నల్లగొండ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రం వాట్స్‌పలో ప్రత్యక్షమైన ఘటనలో డీబార్‌ అయిన విద్యార్థిని ఝాన్సీరాణి హైకోర్టును ఆశ్రయించింది. తనను అన్యాయంగా డీబార్‌ చేశారని, పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరుతూ ఆమె తరుపు న్యాయవాది బుధవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు ఏప్రిల్‌ 7వ తేదీన కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నకిరేకల్‌ ఎస్సీ గురుకులంలోని పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఈ నెల 21వ తేదీన విద్యార్థిని ఝాన్సీరాణి వద్ద ఉన్న తెలుగు-1 ప్రశ్నపత్రాన్ని కిటికీ బయట ఉన్న ఆకాష్‌ అనే వ్యక్తి ఫొటో తీసి వాట్స్‌పలలో షేర్‌ చేశాడు. ఈ ఘటనలో బాలిక ఝాన్సీరాణిని అధికారులు డీబార్‌ చేశారు. అయితే తనకు ఈ లీక్‌ వ్యవహారంతో సంబంధం లేదని, తనకు ఎలాంటి పాపం తెలియదని, అన్యాయంగా డీబార్‌ చేశారని, తనకు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరుతూ ఝాన్సీరాణి తరపు న్యాయవాది బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ఎవరికీ పేపర్‌ ఇవ్వలేదని, కిటికి పక్కకు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి కిటికి ఇవతల గదిలో పరీక్ష రాస్తున్న తనని రాయితో కొడతానని బెదిరించడంతో భయపడి పేపర్‌ని చూపించానని ఝాన్సీరాణి పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా విద్యాశాఖ సెక్రటరీ, నల్లగొండ డీఈవో, నకిరేకల్‌ ఎంఈవో, నకిరేకల్‌ ఎస్సీ గురుకుల పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ని పేర్కొన్నారు. వీరందరూ ఏప్రిల్‌ 7వ తేదీన కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల నడుమ పరస్పర ఆరోపణలు కొనసాగుతుండగా, తప్పుడు ప్రచారాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, కొణతం దిలీప్‌, మన్నె క్రిశాంక్‌పైనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా బాలిక ఝాన్సీరాణి హైకోర్టును ఆశ్రయించడంతో కేసు దర్యాప్తుపై అందరికీ ఆసక్తి నెలకొంది.

Updated Date - Mar 28 , 2025 | 12:26 AM