ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సన్నాహాలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:54 AM
ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు నిర్మించేందుకు సన్నాహాలు వేగవంతం చేసిం ది. ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5లక్షల ఆర్థిక సహా యం అందజేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసేలా ప్రణాళిక అమలు చేస్తోంది.

రూ.5లక్షల ఆర్థిక సహాయంతో పనులు
మోడల్ హౌస్ నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు
దీని ద్వారా లబ్ధిదారులకు అవగాహన
‘డబుల్’ ఇళ్ల పూర్తికి ప్రభుత్వ నిర్ణయం
అంచనాలు రూపొందించే పనిలో అధికారులు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు నిర్మించేందుకు సన్నాహాలు వేగవంతం చేసిం ది. ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5లక్షల ఆర్థిక సహా యం అందజేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసేలా ప్రణాళిక అమలు చేస్తోంది. తొలి విడతగా జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి జిల్లాలో లబ్ధిదారు ల ఎంపిక ప్రక్రియ పూర్తికాగా, ఓ మోడల్ ఇంటిని నిర్మాణం పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో రూ.5లక్షలతో అధికారులు ఓ మోడల్ ఇంటిని నిర్మించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అధికారుల బృందం అవగాహన కల్పించింది. లబ్ధిదారుల ప్రభుత్వం అందిస్తున్న రూ.5లక్షల ఆర్థిక సహాయంతో 400 నుంచి 500 ఎస్‌ఎ్‌ఫటీ విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. ఇదే వ్యయంతో ఒక నమూనా ఇంటిని కూడా అధికారులు నిర్మిస్తున్నారు. ఈ ఇంటిని లబ్ధిదారులకు మోడల్‌గా చూపించనున్నారు.
నిధుల కోసం ‘డబుల్’ లబ్ధిదారుల ఎదురుచూపు...
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూనే, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయల వద్ద మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీంతో ఇళ్లను పొందిన లబ్ధిదారుల సమస్య గట్టెక్కనుంది. ఇన్నాళ్లుగా ఇళ్లు పొందినట్టుగా మంజూరు (ప్రొసీడింగ్) పత్రాలు పొంది, గృహప్రవేశం చేయలేకపోయిన లబ్ధిదారులకు కొంత ఊరట కలిగింది. ప్రభుత్వ నిర్ణయంతో వారు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిధులు త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఇళ్లను నిర్మించి.. వసతులు మరిచి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాకు మొత్తం 3,464 ఇళ్లు మంజూరు కా గా, వీటి నిర్మాణానికి టెండర్లు పిలిచింది. వీటిలో 1,603 ఇళ్లకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. అందులో 829 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 574 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నా యి. పనులు పూర్తయిన ఇళ్లను పంపిణీ చేయడంతో పాటు తుది దశలో ఉన్న ఇళ్లకు అంతర్గత పనులు తాగునీరు, విద్యుత్, సివరేజీ తదితర పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చెల్లించే నిధులు సరిపోకపోవడంతో కాంట్రాక్టర్లు ముందు కు రాలేదు. పలుప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లు అసంపూర్తిగా ఉండగా, మరికొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినా మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో ఇళ్ల పంపిణీ ప్రక్రియ తొమ్మిదేళ్లపాటు సాగింది. భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన 444 ఇళ్ల సముదాయానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పనపై ఆయా శాఖలు అంచనాలు రూపొందించాయి. భువనగిరిలోని సింగన్నగూడంలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల సముదాయానికి రూ.2.75కోట్ల నిధులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, నిధులు మంజూరు చేస్తేనే కాంట్రాక్టర్లు పనులు చేపట్టే అవకాశం ఉంది. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్ద మౌలిక వసతులైన మరుగుదొడ్ల కోసం సెప్టిక్‌ట్యాంక్, సీవరేజ్, వాటర్ ట్యాంక్, విద్యుత్, పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
వివిధ దశల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు
భువనగిరి నియోజకవర్గంలోని 400 ఇళ్లకు టెండర్లు పిలవగా, కేవలం 260 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. మిగతా 140 ఇళ్లకు కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. భువనగిరి నియోజవర్గంలోని భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో రాయిగిరి-యాదాద్రి ప్రధాన రహదారి నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్‌నే అధికారులు ఒప్పించి పట్టణంలోని 160 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. బీబీనగర్ మండలం కొండమడుగు, బీబీనగర్ గ్రామాల్లో 60 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. వలిగొండ మండలం వెల్వవర్తి, అర్రూర్ గ్రామాల్లో 40 ఇళ్లకు లేఅవుట్ మార్కింగ్ స్థాయిలో ఉంది. భువనగిరి మండలం వడపర్తిలో 20, పగిడిపల్లిలో 20, ముస్త్యాలపల్లిలో 20, పోచంపల్లిలో 60, వలిగొండ మండలం నాగారంలో 20 ఇళ్లు నిర్మించాల్సి ఉంది.
ఆలేరు నియోజకవర్గంలో...
ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 240 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. అందులో కేవలం 120 ఇళ్ల నిర్మాణం మాత్రమే ప్రారంభమైంది. మిగతా 160 ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. అందులో 120 ఇళ్లకు నేటికీ స్థలాల కేటాయింపు జరగలేదు. ఆలేరు మండల కేంద్రంలో 60 ఇళ్లకు పునాదుల గుంతలు తవ్వగా, ఆత్మకూర్(ఎం) మండలంలోని దుప్పెల్లిలో 20, రాజాపేట మండల కేంద్రంలో 40, రఘునాథపురంలో 40, తుర్కపల్లి మండలం కొండాపూర్‌లో 20, తుర్కపల్లి మండల కేంద్రానికి 20 ఇళ్లు మంజూరు చేయగా, ఏడెమిదిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇక యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 40, మాసాయిపేటలో 40, మోటకొండూరులో 40 ఇళ్లకు ఇంత వరకు రెవెన్యూ అధికారులు స్థలాలను కేటాయించలేదు.
మునుగోడు నియోజకవర్గంలో..
మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణ్‌పూర్ మండలాల్లోని నాలుగు గ్రామాలకు 400 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు కాగా, చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో కాంట్రాక్టర్లు ముందుకురాక నిర్మాణాలు ప్రారంభం కాలేదు. చౌటుప్పల్ పట్టణానికి 150 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు కాగా, ఆరు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదు. మల్కాపురంలో 60, సంస్థాన్‌నారాయణపూర్ మండల కేంద్రంలో 120, సర్వేల్‌లో 70 ఇళ్లకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించారు.
మోత్కూరులో అంచనాల స్థాయిలోనే..
తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు పట్టణంలో పేదల గృహ వసతి కల్పనకు 70 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరుకాగా, ఇప్పటి వరకు కేవలం అంచనాల తయారీ స్థాయిలోనే కొట్టుమిట్టాడుతోంది. జీ+1 విధానంలో ఇళ్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయగా, అవి టెండర్ల స్థాయిలోనే ఉన్నాయి. అయితే వీటన్నింటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.