సమాజ శ్రేయస్సే లక్ష్యంగా రచనలు చేయాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:34 AM
సమాజ శ్రేయస్సు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచయితలు, కవులు రచనలు చేయాలని ప్రముఖ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. సాహిత్య సంఘాల సౌజన్యంతో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
భువనగిరి టౌన్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): సమాజ శ్రేయస్సు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచయితలు, కవులు రచనలు చేయాలని ప్రముఖ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. సాహిత్య సంఘాల సౌజన్యంతో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అనాది నుంచి నేటి వరకు, భవిష్యత్‌లోనూ సృష్టిలోని అన్ని అంశాలను స్పృశించడం రచయితలకే సాధ్యమన్నారు. అన్ని సందర్భాలలోనూ ప్రజలను ప్రభావిత చేస్తున్నది, చైతన్య పరుస్తున్నది, సాహిత్య రంగమేనన్నారు. తనకు గుర్తింపు రావడానికి కూడా రాసిన గేయాలేనని, తనను ఆదరిస్తున్న అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సాహిత్య, సంప్రదాయ పరిమళాలను కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు నిర్విరామ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 15 మంది రచయితలు, సాహిత్య ప్రముఖులు, సామాజిక కార్యకర్తలకు నాలుగు కేటగిరీలలో పురస్కారాలు అందజేసి అభినందించారు. ముందుగా ఉగాది కవి సమ్మేళనం ఆహ్లాదంగా సాగింది. కార్యక్రమంలో రచయితల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, బండారు జయశ్రీ, ఎంజీయూ మాజీ రిజిస్ర్టార్ కట్ట ముత్యంరెడ్డి, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డి, పర్వతారోహకురాలు పడమటి అన్విత, బండిరాజుల శంకర్, శెట్టి బాలయ్య యాదవ్, గడ్డం నర్సింహారెడ్డి పాల్గొన్నారు.