Share News

Indians in Foreign Jails: విదేశీ జైళ్లల్లో 10 వేల పైచిలుకు మంది భారతీయులు.. ఎంతమందికి మరణ శిక్ష పడిందంటే..

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:30 PM

విదేశాలు 10 వేల పైచిలుకు మంది భారతీయులు ఉన్నారని కేంద్ర మంత్రి క్రితి వర్ధన్ సింగ్ అన్నారు. ఇక యూఏఈలో 25 మంది భారతీయులకు మరణ శిక్ష వేసిందని తెలిపారు.

Indians in Foreign Jails: విదేశీ జైళ్లల్లో 10 వేల పైచిలుకు మంది భారతీయులు.. ఎంతమందికి మరణ శిక్ష పడిందంటే..
Indians in foreign jails

ఇంటర్నెట్ డెస్క్: యూఏఈలో 25 మంది భారతీయులకు మరణ శిక్ష పడిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి క్రితి వర్ధన్ సింగ్ గురువారం పార్లమెంటులో తెలిపారు. అయితే, ఈ శిక్షలేవీ ఇప్పటివరకూ అమలు కాలేదని అన్నారు. ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.

విదేశీ జైళ్లల్లో మొత్తం 10,512 మంది భారతీయులు ఉన్నారని ఆయన తెలిపారు. వీరిలో విచారణ ఖైదీలు కూడా ఉన్నారని అన్నారు. విదేశాల్లోని భారతీయుల భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని కూడా ఆయన చెప్పారు. వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. న్యాయ సహాయంతో పాటు అన్ని రకాలుగా వారికి ఆపన్న హస్తం అందిస్తామని తెలిపారు.


Also Read: స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలి.. అమెరికాలో భారతీయులకు కేంద్రం సూచన

అనేక దేశాలు భారతీయులకు మరణ శిక్షలు విధించాయని అన్నారు. మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయుల్లో యూఏఈలో 25 మంది, సౌదీ అరేబియాలో 11 మంది, మలేషియాలో ఆరుగురు, కువైత్‌లో ముగ్గురు, యెమెన్, ఇండోనేషియా, ఖతర్, యూఎస్‌ ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని అన్నారు. గతేడాది సౌదీ అరేబియా, కువైత్‌లు చెరో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష అమలు చేశాయని తెలిపారు. అంతకుముందు ఏడాదిలో కువైత్, సౌదీ అరేబియా ఐదుుగురు భారతీయులకు మరణ శిక్ష అమలు చేసినట్టు తెలిపారు. ఎంతమందికి ఉరి శిక్ష అమలు చేసిందీ యూఏఈ అధికారికంగా ప్రకటించదని కూడా మంత్రి పేర్కొన్నారు. అయితే, వివిధ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం 2000-2024 మధ్య కాలంలో యూఏఈ భారతీయులెవరికీ మరణ శిక్ష విధించలేదని కూడా చెప్పారు.


Also Read: నేను చేసిన తప్పు మీరు చేయొద్దు.. కెనడాలో భారతీయ విద్యార్థి విచారం

ఇక నిపుణులు చెప్పే దాని ప్రకారం, ప్రస్తుతం 53 దేశాల్లో నేరస్తులకు మరణ శిక్ష విధిస్తున్నారు. 2022లో అత్యధికంగా చైనాలో 1000 మందికి మరణ శిక్ష అమలు చేశారు. అమెరికాలో 18 మందికి ఈ శిక్ష అమలు చేశారు. మరోవైపు, 110 దేశాలు మరణ శిక్ష విధించడాన్ని పూర్తిగా రద్దు చేశాయి. మరి కొన్ని దేశాల్లోని చట్టాలు మరణశిక్షను అనుమతించినా అక్కడి కోర్టులు మాత్రం ఈ శిక్షను విధించట్లేదు.

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2025 | 04:36 PM