Share News

Ponguleti: భూముల విలువలు పెరుగుతాయ్‌

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:19 AM

ధరణి సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయన్నారు. సాదా బైనామా విషయంలో ఇకపై కొత్త దరఖాస్తులను స్వీకరించేది లేదని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువును ఈ నెల తరువాత పొడగించే ఆలోచన లేదన్నారు.

Ponguleti: భూముల  విలువలు పెరుగుతాయ్‌

  • భూ భారతి అమల్లోకి వచ్చాక పెంచుతాం

  • సాదా బైనామాల కొత్త దరఖాస్తులు తీసుకోం

  • ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు పొడిగింపు ఉండదు

  • విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి

  • ఏటా భూముల విలువ పెంపు!

  • అప్పుడే ఎక్కువ లావాదేవీలున్న చోట అదనపు రాబడికి చాన్స్‌

  • మహారాష్ట్రలో ఇదే విధానం.. థర్డ్‌పార్టీ నివేదికలో ప్రతిపాదనలు

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో భూముల విలువలు పెంచుతామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. భూ భారతి దాదాపు పూర్తయిందని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ధరణి సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయన్నారు. సాదా బైనామా విషయంలో ఇకపై కొత్త దరఖాస్తులను స్వీకరించేది లేదని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువును ఈ నెల తరువాత పొడగించే ఆలోచన లేదన్నారు. పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మంత్రి పొంగులేటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సాదా బైనామాకు సంబంధించి రాష్ట్రంలో 13 లక్షల దరఖాస్తులను గత ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. తిరస్కరణకు గురైనవారు అప్పీలేట్‌ అథారిటీని ఆశ్రయించవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదై ఉన్న 12 లక్షల దరఖాస్తులను మాత్రమే తాము పరిష్కరిస్తామని, కొత్తవి చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. ఇక అసైన్డ్‌ భూములను అమ్ముకునే అవకాశం లేదన్నారు. రిజిస్ర్టేషన్‌ శాఖలో త్వరలో స్లాట్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. ఆధార్‌తో అనుసంధానం చేసి 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో రిజిస్ర్టేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా 15 రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో దీనిని అమలు చేయబోతున్నామని, అక్కడ తలెత్తే ఇబ్బందులను అధిగమించాక రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని వివరించారు. రిజిస్ర్టేషన్‌కు సర్వే మ్యాప్‌ అవసరమని, మ్యాప్‌ లేనివారికి కూడా సర్వే చేయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి మంది సర్వేయర్లను నియమిస్తున్నామని, ప్రతి మండలానికి ఒక సర్వేయర్‌, ఒక డిప్యూటీ సర్వేయర్‌ ఉండేలా చూస్తున్నామని అన్నారు. వీరితోపాటు 6వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించి, వారికి శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్మీడియట్‌ అర్హతగా 10,956 మంది గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బందిని నియమిస్తున్నామని వెల్లడించారు.


ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగించే ఆలోచన లేదు..

ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి మంచి స్పందన ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ నెల 31 వరకు అందుబాటులో ఉండే 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాయితీ గడువును పొడగించే ఆలోచన లేదన్నారు. దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాక ఒక్క కేసు కూడా మిస్‌ అయ్యే ప్రసక్తే లేదన్నారు. గతంలో 10 శాతం రిజిస్ర్టేషన్‌ అయి.. అమ్మకం కాని 90 శాతం ప్లాట్లు ఉన్న లేఅవుట్లకు కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చేయకుండా ఇష్టానుసారం వ్యవహరించే కొంతమంది సబ్‌ రిజిస్ర్టార్లు సస్పెండ్‌ అవుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పొంగులేటి స్పష్టం చేశారు. అభిమన్యరెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. రోజూ వివిధ సమస్యల మీద వందకు పైగా అర్జీలు వస్తుంటాయని, అందులో సక్రమంగా ఉన్నవాటిని పరిష్కరిస్తున్నామని అన్నారు. పార్టీలకతీతంగా సక్రమంగా ఉండే అర్జీలకు ఎవరి సిఫారసులు లేకుండానే పని అయిపోతుందన్నారు. సక్రమంగా లేని పనులు చేయమంటే తాను చేయనని మంత్రి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో 1,13,000 ఇళ్లను మంజూరు చేసిందన్నారు. పట్టణ ప్రాంతంలో నిర్మించే ఇళ్లకు కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తుందని, మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పేరులో ఎలాంటి మార్పు లేదన్నారు.


ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ 9.5 కిలోమీటర్లు పెండింగ్‌ ఉంది

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ మొత్తం 41.6 కిలోమీటర్లు కాగా, అందులో ఇంకా 9.5 కిలోమీటర్లు మాత్రమే తవ్వాల్సి ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. పెండింగ్‌ ఉన్న ప్రాంతంలో టీబీఎం ద్వారా కాకుండా మనుషులతో పనులు చేయాల్సి ఉందన్నారు. ప్రమాద ఘటనలో ఇరుక్కున్న మృతదేహాలను వెలికితీస్తామని, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

For Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:22 AM