Indiramma House: ఇందిరమ్మ నమూనా ఇల్లు రెడీ!
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:21 AM
రాష్ట్రంలో మొట్టమొదటి ఇందిరమ్మ నమూనా ఇల్లు సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మితమైన ఈ ఇంటిని గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం ఏడు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఖమ్మం కూసుమంచిలో పూర్తయిన నిర్మాణం
నేడు ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి
కూసుమంచి, ఖమ్మం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొట్టమొదటి ఇందిరమ్మ నమూనా ఇల్లు సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మితమైన ఈ ఇంటిని గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం ఏడు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో అర్హులను సర్వే ద్వారా గుర్తిస్తున్న ప్రభుత్వం రూ.5 లక్షల వ్యయంతోనే ఇందిరమ్మ మోడల్‌హౌ్‌సను నిర్మించాలని తలపెట్టింది. అందులో భాగంగా గతేడాది డిసెంబరు 13న కూసుమంచిలో మంత్రి ఈ ఇంటికి శంకుస్థాపన చేశారు. నెల రోజుల వ్యవధిలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుమారు 50 గజాల స్థలంలో రూ.5 లక్షల వ్యయంతో ఇంటిని నిర్మించాలని తలపెట్టగా ఇంటిస్లాబ్‌పై కంటె గోడ నిర్మాణానికి, ముందుభాగాన చిన్న వరండా నిర్మాణానికి సుమారు లక్ష అదనంగా ఖర్చయినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం భోగి పండుగ రోజున మంత్రి పొంగులేటి చేతులమీదుగా ఇంటిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, ఖమ్మం జిల్లాలో సోమవారం ఐదుగురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఉదయం ఖమ్మం కలెక్టరేట్‌లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేసపన్‌కార్డుల పంపిణీపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అనంతరం మధ్యాహ్నం 1:30గంటకు రఘునాథపాలెం మండలం మంచుకొండలో రూ.66.33కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి మంత్రులు శంకుస్థాపన చేస్తారు.