Supreme Court: 2 వారాల్లో కౌంటర్ వేయండి
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:05 AM
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం కేసులో ఏప్రిల్ 24న తుది వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

ఎమ్మెల్సీల కేసులో తెలంగాణ సర్కారు, గవర్నర్ కార్యాలయం, కోదండరాం, ఆమీర్ అలీఖాన్‌కు సుప్రీం ఆదేశం
ఏప్రిల్ 24న తుది వాదనలు
న్యూఢిల్లీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం కేసులో ఏప్రిల్ 24న తుది వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది. రాజకీయ నేపథ్యం ఉందంటూ నాటి గవర్నర్ తమిళిసై వారి పేర్లను తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో కేసు నడుస్తుండగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ఏడాది జనవరి 13న కోదండరాం, ఆమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం సిఫారసు చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే, హైకోర్టులో కేసు విచారణలో ఉండగా తమ కోటాలో మరో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ఎలా నియమిస్తారంటూ శ్రవణ్‌కుమార్, సత్యనారాయణ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత గత ఏడాది మార్చి 17న సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది.
దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ నామినేషన్లను తిరసరిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అలీఖాన్ల పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫారసు చేయగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. వారు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 4న తమకు న్యాయం చేయాలని కోరుతూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై గురువారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దాసోజు శ్రవణ్ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇది గవర్నర్ అధికారాలకు సంబంధించిన కేసని శ్రవణ్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనల విన్న ధర్మాసనం.. ప్రతివాదులైన గవర్నర్ కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం, కోదండరాం, ఆమీర్ అలీఖాన్ రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 24న చేపడతామని తెలిపింది. ఆ రోజు తుదితీర్పు ఉంటుందని స్పష్టం చేసింది.