Share News

Bhatti Vikramarka: రికార్డుస్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:42 AM

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 4.39 గంటలకు విద్యుత్‌ డిమాండ్‌ ఏకంగా 17,162 మెగావాట్లకు చేరుకుని కొత్త రికార్డును సృష్టించింది.

Bhatti Vikramarka: రికార్డుస్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌

  • 17,162 మెగావాట్లుగా నమోదు

  • రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి

  • కోతల్లేకుండా సరఫరా: భట్టి

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 4.39 గంటలకు విద్యుత్‌ డిమాండ్‌ ఏకంగా 17,162 మెగావాట్లకు చేరుకుని కొత్త రికార్డును సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో విద్యుత్‌ డిమాండ్‌ 17వేల మెగావాట్లు దాటడం ఇదే తొలిసారి. గతేడాది ఇదే రోజున రాష్ట్రంలో గరిష్ఠంగా 13,557 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. గతేడాది మార్చి 8న నమోదైన 15,523 మెగావాట్ల గరిష్ఠ డిమాండే ఈ ఏడాది ప్రారంభం వరకు అత్యధికం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 5న డిమాండ్‌ 15,752 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత డిమాండ్‌ రోజురోజుకూ పెరగడంతో కొత్త రికార్డులు నమోదయ్యాయి.


ఈ నెలలో రోజువారీ గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 16వేల మెగావాట్లకు మించి నమోదవుతోంది. ఈ నెల 18న 335.19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) పరిధిలో కూడా గురువారం 11,017 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. కాగా, రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 17 వేల మెగావాట్లు దాటినా రెప్పపాటు విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా అందించామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెచ్చిన సంస్కరణలతో ఇది సాధ్యమైందన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 04:42 AM