Musi River: మూసీ బఫర్ జోన్‌లో నిర్మాణాలపై నిషేధం
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:43 AM
రాష్ట్ర ప్రభుత్వం మూసీ, ఈసా నదుల వెంట అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు ఉపక్రమించింది. రెండు నదుల వెంబడి బఫర్ జోన్ 50 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది.

50-100 మీటర్లలోపు కొత్త నిర్మాణాలకు మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు అనుమతి లేదు
రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలన్నా అధికారుల కమిటీ ఆమోదం ఉండాలి.. ప్రభుత్వం ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మూసీ, ఈసా నదుల వెంట అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు ఉపక్రమించింది. రెండు నదుల వెంబడి బఫర్ జోన్ 50 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. నది నుంచి 50 నుంచి 100 మీటర్ల పరిధిలో నిర్మాణాలపైనా ఆంక్షలు విధించింది. మూసీ, ఈసా నదుల సమగ్ర మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు లేదా డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఎంఆర్‌డీసీఎల్ అధికారులతో కూడిన కమిటీ ఆమోదిస్తే తప్ప 50 నుంచి 100 మీటర్ల పరిధిలో కొత్త నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. బఫర్ జోన్ సహా 100 మీటర్లలోపు ప్రజల సదుపాయం కోసం రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలన్నా కూడా ఈ కమిటీ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నదీ తీరంలో, బఫర్ జోన్‌లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
దీంతో ప్రభుత్వ ఆదేశాలతో వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారుల కమిటీ పరిశీలించి.. మూసీ, ఈసా నదుల వెంబడి నిర్మాణాలపై నియంత్రణ అవసరమని సూచించింది. దీంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని మూసీ రివర్ ఫ్రంట్ డవల్‌పమెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించారు. కాగా, 55 కి.మీ మేర మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటకాన్ని ప్రొత్సహించేలా మూసీ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. సుమారు రూ.4 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో గాంధీ సరోవర్ పేరుతో బాపూఘాట్ అభివృద్ధి పనులు చేపట్టనుంది. మూసీ నది మీద 17 కొత్త వంతెనల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నదీ తీరం వెంట మెట్రో రైల్ మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
For More AP News and Telugu News