Heatwave: మళ్లీ మండిపోనున్న ఎండలు!
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:41 AM
రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మంగళవారంఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మినహా అన్ని జిల్లాలకు ఎండ తీవ్రతకు సంబంధించి ఆరేంజ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే సోమవారం మాత్రం రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని బండమీదిపల్లి గ్రామానికి చెందిన పిట్టల శంకర్(30) శనివారం వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతణ్ణి వెల్దుర్తిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి శంకర్ మృతిచెందాడు.