Share News

Revanth Reddy: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం..

ABN , Publish Date - Mar 27 , 2025 | 02:44 PM

Revanth Reddy Delimitation Resolution : డీలిమిటేషన్‌ ప్రక్రియపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసనసభ వేదికగా తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

Revanth Reddy: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం..
CM Revanth Reddy

Revanth Reddy Delimitation Resolution : రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఇష్టానుసారంగా డీలిమిటేషన్ విధానంపై నిర్ణయం తీసుకుంటోందంటూ దక్షిణాది రాష్ట్రాలు తొలినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మొదట ఈ అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ పోరాటం మొదలుపెట్టారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా డీలిమిటేషన్ ప్రక్రియను ఖండిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ అమల్లోకి వస్తే ప్రజలకు కలిగే నష్టాలను అసెంబ్లీ వేదికగా ఇలా వెల్లడించారు.


డీలిమిటేషన్‌ వల్ల సౌత్‌కు అన్యాయం..

డీలిమిటేషన్ విధానంపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకపోవడాన్ని తెలంగాణ అసెంబ్లీ తీవ్రంగా ఖండిస్తోంది. డీలిమిటేషన్‌ అనేది సౌత్‌కు లిమిటేషన్‌గా మారే ప్రమాదం ఉంది. 1971 నుంచి జనాభా నియంత్రణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయి.కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదు. 2026లో జనాభా లెక్కలు చేపట్టి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనుకోవడం కరెక్ట్ కాదు. దీనివల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. డీలిమిటేషన్‌ వల్ల ఆర్థిక ప్రయోజనాలతోపాటు ఉద్యోగ, ఉపాధి అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉంది. లోక్‌సభ సీట్లను కేంద్రం పునర్విభజన చేస్తే దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని అన్నారు.


వాళ్లకి పెంచారు.. మనకెందుకు పెంచరు..

2026 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేయవద్దని.. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో పాటుగా తెలంగాణాలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని.. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనం కోసం జమ్మూకశ్మీర్‌, అసోంలో నియోజకవర్గాలు పెంచారని ఉదహరించారు.


మన ప్రాతినిధ్యం 24 నుంచి 19 శాతానికి పడిపోతుంది : సీఎం రేవంత్‌

డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశం గురించి కూడా సీఎం రేవంత్ ప్రస్తావించారు. నియోజవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేపట్టడాన్ని వాజ్‌పేయీ సైతం వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఈ ప్రక్రియను ఎంత మాత్రం అంగీకరించబోమని, ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 నుంచి 19 శాతానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరం ఒకే మాటపై ఉందామని పార్టీలను కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిక్కిం, జమ్మూ కశ్మీర్‌ నియోజకవర్గాలను పెంచిన కేంద్రం పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటులో 24 శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు 36 శాతం పన్నులు కడుతున్నా అందులోంచి తిరిగి వచ్చేది తక్కువే అని అన్నారు. ఇందుకు భిన్నంగా కేంద్రం పన్నుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌కు ఎక్కువ వాటా ఉందని అన్నారు.


Read Also: CAG Report: అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Paper leakage: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

Building Collapse: కుప్పకూలిన భవనం.. చికిత్సపొందుతూ మేస్త్రీ మృతి..

Updated Date - Mar 27 , 2025 | 02:51 PM