‘ఉస్మానియా’లో స్కిన్‌ బ్యాంక్‌

ABN , First Publish Date - 2021-07-01T15:36:27+05:30 IST

ఉస్మానియా మరో కొత్త రికార్డును సొంత చేసుకోబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలో ప్రైవేట్‌, కార్పొరేటర్‌ ఆస్పత్రుల్లో కూడా లేని చర్మనిధి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కాస్మోటిక్‌ సర్జరీల కోసం దక్షిణ భారత్‌లో ఎక్కువగా..

‘ఉస్మానియా’లో స్కిన్‌ బ్యాంక్‌

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రప్రథమంగా.. 

రికవరీ రేటు 75 నుంచి 80 శాతం వరకు పెరిగే అవకాశం

అధికంగా కాలిన రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఆస్కారం

అనుమతించిన జీవన్‌దాన్‌

మరో రెండు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి 


మంగళ్‌హాట్‌(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా మరో కొత్త రికార్డును సొంత చేసుకోబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలో ప్రైవేట్‌, కార్పొరేటర్‌ ఆస్పత్రుల్లో కూడా లేని చర్మనిధి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కాస్మోటిక్‌ సర్జరీల కోసం దక్షిణ భారత్‌లో ఎక్కువగా వాడే స్కిన్‌ బ్యాంక్‌ ఇప్పుడు కాలిన గాయాలతో వచ్చే పేద రోగుల ప్రాణాలను కాపాడేందుకు అన్ని హంగులతో సిద్ధమైంది. 


ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో ఎక్కడా లేని విధంగా ఎనిమిది ప్లాస్టిక్‌ సర్జరీ సూపర్‌ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. ఇందు కోసం ప్రతిసారీ ఎంసీఐ ప్రతినిధులు తనిఖీ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి వస్తుంటారు. 2017లోనూ తనిఖీ నిమిత్తం వచ్చిన అధికారులు ప్రతి సంవత్సరం దాదాపు 1200 మంది రోగులకు ఇన్‌పేషెంట్‌ చికిత్సలు అందిస్తున్నట్లు తెలుసుకొని ఆస్పత్రిలో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయడంతో రోగులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుందని అప్పటి హెచ్‌ఓడీ డాక్టర్‌ నాగప్రసాద్‌కు సూచనలు చేశారు. ఒక్కసారి స్కిన్‌ బ్యాంక్‌ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం 65 శాతం ఉన్న రికవరీ రేటు 80 శాతానికి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పడంతో ఆయన వెంటనే స్కిన్‌ బ్యాంకుకు అవసరమైన నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ప్రభుత్వం వద్దకు వెళ్లిన ఫైల్‌ ముందుకు కదలకపోవడంతో స్వచ్ఛంద సంస్థతో కలిసి స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. దీంతో అధికారుల నుంచి సానుకూలంగా స్పందన రావడంతో ముంబాయిలోని నేషనల్‌ బర్న్‌ సెంటర్‌కు చెందిన వైద్యులు డాక్టర్‌ సునీల్‌ కేశ్వానిని సంప్రదించి స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు అవసరైన సూచనలు సలహాలు తీసుకున్నారు.


ఆయన ద్వారానే ముంబాయిలోని రోటరీ క్లబ్‌ ప్రతినిధులతో చర్చించి ఉస్మానియా ఆస్పత్రిలో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో 1500 ఎస్‌ఎఫ్టీలో ఈ స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు పనులు మొదలు కాగా ఇటలీ, జర్మనీల నుంచి అత్యాధునికి యంత్రాలు, సామగ్రిని తెప్పించి ఇన్‌స్టాల్‌ చేశారు. మొత్తం రూ. 60 లక్షలు ఖర్చు చేసి ఒకసారి స్టోర్‌ చేసిన స్కిన్‌ను ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైన వాడేలా బ్యాంక్‌ను సిద్ధం చేశారు. సివల్‌ వర్క్స్‌తోపాటు యంత్రాల ఏర్పాటు పూర్తి కావడంతో ఇటీవల రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ ఆలీ స్కిన్‌ బ్యాంక్‌ను ప్రారంభించారు.


ప్రాణాలకు రక్షణగా..

విద్యుత్‌ షాక్‌, ఇతర ప్రమాదాల్లో కాలిగిన గాయాలతో ప్రతి రోజూ ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి 40 నుంచి 50 మంది వరకు వస్తుంటారు. ప్రతి సంవత్సరమూ 1200 మంది వరకు అడ్మిట్‌ అవుతుంటారు. వీరిలో 35 నుంచి 45 శాతం కాలిన గాయలతో ఉన్న వారి శరీరంలోని తొడలు, చేతుల భాగం నుంచి స్కిన్‌ తీసి కాలిన ప్రాంతంలో స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ చేసి వారి ప్రాణాలను కాపాడుతుంటారు. అదే 45 శాతానికి పైగా కాలిన గాయాలైన వారికి చర్మంలోని డీప్‌ డెర్మిస్‌, ఎపీడెర్మిస్‌, డెర్మిస్‌ పోరలు కాలిపోయిన క్రమంలో ఆస్పత్రి వైద్యులు ఇచ్చే ఫ్లూయిడ్స్‌ మొత్తం నీటి రూపంలో బయటకు పోతుంది. దీంతో పాటు చర్మం కాలిపోవడంతో ఇన్ఫెక్షన్‌ వెంటనే సోకి ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటి సందర్భంలో ఎక్కువ కాలిన గాయాలైన వారికి స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ ద్వారా కాలిన ప్రాంతంలో చర్మాన్ని అంటించి ప్రొటిన్స్‌తో కూడిన ఫ్లూయిడ్స్‌ బయటకు పోకుండా చేయవచ్చు. కానీ, గాయాలు అధికంగా ఉన్న వారి శరీరం నుంచి చర్మం తీసుకునే అవకాశం ఉండదు. దీంతో స్కిన్‌ బ్యాంక్‌లోని చర్మాన్ని కాలిన భాగాల్లో అంటించడంతో మూడువారాలపాటు వారికి ఇన్ఫెక్షన్‌ సోకకుండా చేయడంతోపాటు ఫ్లూయిడ్స్‌ ఇచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. మూడు వారాల తర్వాత అంటించిన చర్మం ఊడిపోతుంది. అంతలోపు బాధితుడిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి సర్జరీ చేసేందుకు శరీరం సహకరిస్తుంది. దీంతో ఎక్కువ కాలిన గాయాలతో వచ్చే వారి ప్రాణాలను కాపాడేందుకు స్కిన్‌ బ్యాంక్‌ దోహదపడుతుందని వైద్యులంటున్నారు. 


అనుమతించిన జీవన్‌దాన్‌

కిడ్నీ, గుండె, కాలేయం ఇలా శరీరంలోని అవయవాలు పాడైతే బ్రెయిన్‌ డెడ్‌, ప్రమాదాల్లో మరణించి వారి నుంచి ఆయా అవయవాలను సేకరించి జీవన్‌దాన్‌ సహకారంతో అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా అమర్చి ప్రాణాలను కాపాడుతున్న విషయం తెలిసిందే. కాగా, ప్రమాదాల్లో మరణించిన, బ్రెయిన్‌ డెడ్‌ పేషెంట్ల నుంచి స్కిన్‌ సేకరించి స్టోర్‌ చేసేందుకు జీవన్‌ధాన్‌ అనుమతులు తప్పని సరి. ఇలా సేకరించి చర్మాన్ని ఐదు సంవత్సరాల వరకు స్టోర్‌ చేసే అవకాశం ఉండడంతో ఇటీవల జీవన్‌దాన్‌ అధికారుల బృందం ఉస్మానియా స్కిన్‌ బ్యాంక్‌ను పరిశీలించి అనుమతులిచ్చారు. దీంతో ఉస్మానియాతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు స్కిన్‌ అమర్చేందుకు ఆస్కారం ఉంటుందని, కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రులకు సైతం నామినల్‌ చార్జె్‌సతో స్కిన్‌ పంపిణీ చేసే అవకాశం సృష్టించినట్లవుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.


జీవన్‌దాన్‌లో ఎన్ని ఆస్పత్రులైతే ఎన్‌రోల్‌ చేసుకున్నాయో వాటన్నింటికీ అవసరమైన సందర్భంలో స్కిన్‌ ప్రొవైడ్‌ చే సేందుకు వీలుంటుంది. ఇదిలా ఉండగా రోటరీ క్లబ్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన అధికారులు 95 శాతం చర్మాన్ని ఉస్మానియా రోగులకే వాడాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియాకు కాలిన గాయాలతో వచ్చే వారి రికవరీ రేటు ఏటా 65 శాతంగా ఉండగా స్కిన్‌ బ్యాంక్‌ అందుబాటులోకి రావడంతో అది 75 నుంచి 80 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. స్కిన్‌ బ్యాంక్‌కు సంబంధించి కొన్ని టెక్నికల్‌, ఎలక్ట్రీకల్‌ వర్క్స్‌ పెండింగ్‌లో ఉండడంతో మరో రెండు నెలల్లో పూర్తి స్థాయిలో పనులు ముగుస్తాయని, తదనంతరం రోగులకు స్కిన్‌ బ్యాంక్‌ అందుబాటులోకి వస్తుందని వైద్యులు తెలిపారు. 



ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు..

స్కిన్‌ బ్యాంక్‌ అందుబాటులోకి వస్తే తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రా తదితర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక్కసారి స్టోర్‌ చేసిన చర్మాన్ని ఐదేళ్లలో ఎప్పుడైనా వాడుకునే అవకాశం ఉండడంతో అధికంగా కాలిన రోగుల ప్రాణాలను కాపాడేందుకు స్టోర్‌ చేసిన చర్మాన్ని వాడుకోవచ్చు. ఉస్మానియాలాంటి ఆస్పత్రిలో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది. 

- ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగప్రసాద్‌


Updated Date - 2021-07-01T15:36:27+05:30 IST