గోదావరి-కావేరి అనుసంధానంలో పైప్‌లైన్‌ లేదు

ABN , First Publish Date - 2021-04-13T07:30:14+05:30 IST

తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టులో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గోదావరి-కావేరి అనుసంధానంలో పైప్‌లైన్‌ లేదు

  • ఓపెన్‌ కాలువల ద్వారానే నీటి తరలింపు
  • మధ్యలో తెలంగాణ అవసరాలకు నీరు
  • అనికేపల్లికి బదులు ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ
  • మహానది-గోదావరిమధ్య మరో అనుసంధానం
  • తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
  • డీపీఆర్‌కు మెరుగులు.. మేలో కేంద్ర బృందం రాక

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టులో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి నుంచి నాగార్జున సాగర్‌కు నీటి తరలింపును పైప్‌లైన్ల ద్వారా కాకుండా ఓపెన్‌ కాలువల ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించనున్న బ్యారేజీని ఖమ్మం జిల్లా అనికేపల్లి వద్ద కాకుండా కాస్త ఎగువన ఇచ్చంపల్లి దగ్గర చేపట్టనున్నారు. ఈ మేరకు డీపీఆర్‌లో మార్పులు చేస్తున్నారు. కొత్త డీపీఆర్‌ కసరత్తు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి ఈ ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. పాత డీపీఆర్‌ ప్రకారం అనుసంధాన ప్రాజెక్టునకు సుమారు రూ.47 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. తరలించే నీటిలో కొంత భాగాన్ని మార్గమధ్యంలో తెలంగాణకు, తర్వాత ఏపీకి సరఫరా చేసి, మిగిలిన నీటిని తమిళనాడులోని కావేరి బేసిన్‌కు తరలిస్తారు. ఇందులో భాగంగా బ్యారేజీ, కాలువ, పైప్‌లైన్‌, పలు లిప్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. గోదావరిలో మిగులు జలాలు లేవని, ఉన్న నీరు తెలంగాణ అవసరాలకే సరిపోతుందని కేంద్రానికి స్పష్టం చేసింది. 


తెలంగాణ అవసరాలు తీరిన తర్వాత మిగిలే నీటిని ఇతర బేసిన్‌లకు తరలించాలని, అప్పటి వరకు నదుల అనుసంధానం చేపట్టవద్దని కోరింది. గోదావరి నీటిని కావేరి బేసిన్‌కు తరలించాలంటే ముందు మహానది నీటిని గోదావరిలోకి మళ్లించాలని డిమాండ్‌ చేసింది. అలా మళ్లించిన నీటినే కావేరీకి తీసుకెళ్లాలని కోరింది. దాంతో గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టు డీపీఆర్‌ను పక్కన పెట్టారు. తెలంగాణ కోరినట్టుగా మహానది నుంచి గోదావరికి నీటిని తరలించడానికి సాధ్యాసాధ్యాల నివేదికను కేంద్రం రూపొందించింది. మహానది-గోదావరి, గోదావరి-కావేరి ప్రాజెక్టులను వేర్వేరుగా చేపట్టేందుకు సమాయత్తమయ్యారు. ప్రాజెక్టులో పలు మార్పులు చేశారు. గోదావరిపై నిర్మించే బ్యారేజీ అనికెపల్లి వద్ద కాకుండా ఇచ్చంపల్లి వద్ద నిర్మించాలని నిర్ణయించారు. తక్కువ ముంపు ఉండే విధంగా బ్యారేజీని డిజైన్‌ చేస్తున్నారు. ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి, నాగార్జునసాగర్‌ వరకు ఓపెన్‌ కాల్వ ద్వారానే తరలించాలని నిర్ణయించారు. తద్వారా మధ్యలో తెలంగాణ అవసరాలకు ఉపయోగించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. పైప్‌లైన్‌ ద్వారా తరలించాలన్న ఆలోచనను విరమించుకున్నారు. డీపీఆర్‌ ఖరారయ్యాక కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశముంది. బ్యారేజీ, ఓపెన్‌ కాలువ కోసం భారీగా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది.  కొత్త డీపీఆర్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దాన్ని బట్టి ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Updated Date - 2021-04-13T07:30:14+05:30 IST