AROGYA SRI: అసలు బకాయిలెంత!
ABN , First Publish Date - 2022-11-02T05:45:16+05:30 IST
ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో స్పందించారు. అయితే ఆ కథనంలో ప్రస్తావించిన అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వకుండా మూడింటికి మాత్రమే వివరణ ఇచ్చారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు జరగలేదనడం వాస్తవం కాదన్నారు. 2022 జూలై వరకూ ఆస్పత్రులకు క్లెయిమ్‌లు చెల్లించామన్నారు.

ఆస్పత్రులకు బిల్లులు చెల్లిస్తే ఈ గగ్గోలెందుకు?
వాటిల్లో రోగులను ఎందుకు చేర్చుకోవడం లేదు?
ఈహెచ్‌ఎస్ బకాయిలపై స్పందన ఏదీ?
దేనిపైనా స్పష్టత ఇవ్వని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో
‘ఆంధ్రజ్యోతి’ కథనం అవాస్తవమని బుకాయింపు
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో స్పందించారు. అయితే ఆ కథనంలో ప్రస్తావించిన అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వకుండా మూడింటికి మాత్రమే వివరణ ఇచ్చారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు జరగలేదనడం వాస్తవం కాదన్నారు. 2022 జూలై వరకూ ఆస్పత్రులకు క్లెయిమ్‌లు చెల్లించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్పత్రులకు బిల్లులు చెల్లించలేదని ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో ఎక్కడా చెప్పలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ రెండు, మూడుసార్లు మాత్రమే చెల్లింపులు చేశారని వివరంగా పేర్కొంది. మరోవైపు జూలైలో క్లెయిమ్‌లకు చెల్లింపులు చేశామని సీఈవో చెప్పిన విషయాన్నే ‘ఆంధ్రజ్యోతి’ కూడా ప్రచురించింది. జూలై, ఆగస్టుల్లో కొంతమొత్తాన్ని విడుదల చేశారని అందులో స్పష్టంగా ఉంది. 2022-23కి కేంద్రం విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్ నిధులను నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపు కోసం వినియోగించారనడం సత్యదూరమని సీఈవో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.
అయితే ఈ ఏడాదికి సంబంధించిన ఆయుష్మాన్ భారత్ నిధులను ఆస్పత్రులకు విడుదల చేశారని ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో ఎక్కడా ప్రస్తావించ లేదు. మరోవైపు ఈసారి ఆ నిధులు ఏపీకే కాదు ఏ రాష్ట్రానికీ ఇప్పటి వరకూ విడుదల కాలేదు. గతేడాదికి సంబంధించిన నిధుల్లో రూ.137కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. వాటిని తెప్పించుకోవడంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ విఫలమైంది. దీనిపై ట్రస్ట్ సీఈవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మందలించడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద ఢిల్లీ వెళ్లి నిధులు విడుదల చేయించుకున్నారు. అవి ఈ ఏడాది జూలైలో వచ్చాయి. వాటినే నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తలా కొంత విడుదల చేసిందని ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో వెల్లడించింది. ‘‘ఇప్పటి వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నిధులు రూ.1,790 కోట్లను ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులకు వినియోగించింది’’ అని అధికారులు పేర్కొన్నారు. కానీ అసలు బకాయిలు ఎంత అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు మొత్తం బకాయిలు చెల్లిస్తే... ఆరోగ్యశ్రీ రోగులను చేర్చుకునేందుకు ఆస్పత్రుల యాజమాన్యం ఎందుకు ససేమిరా అంటున్నారో, బిల్లుల కోసం ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అధికారులే సమాధానం చెప్పాలి.
ఈహెచ్‌ఎస్‌పైనా దాటవేత
మరోవైపు ఈహెచ్‌ఎ్‌సకు రూ.199.5కోట్లు చెల్లించినట్లు సీఈవో తెలిపారు. అంతమొత్తంలో బిల్లులు ఇచ్చిన ట్రస్ట్ కేవలం రూ.40కోట్లు ఎందుకు పెండింగ్ పెట్టిందో మాత్రం చెప్పలేదు. ఆరోగ్యశ్రీ కంటే ఈహెచ్‌ఎస్ సేవలు పొందడంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు ట్రస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన ఉండటం లేదు. ఈ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు... ‘ఆంధ్రజ్యోతి’ కథనాలకు స్పష్టమైన వివరణలు ఇవ్వకపోవగా, అవన్నీ అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు.