Srikalahasti: కోడలి పంతం వల్ల ఎంత పని జరిగిందో చూడండి.. పంతం, కోపం మిగిల్చిన విషాదం..
ABN , First Publish Date - 2022-11-27T19:00:15+05:30 IST
యువ దంపతుల మధ్య తలెత్తిన పంతానికి అభంశుభం తెలియని పసిబిడ్డ బలైపోవడం శ్రీకాళహస్తివాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది. మూడు నెలల మగబిడ్డను..
శ్రీకాళహస్తి: యువ దంపతుల మధ్య తలెత్తిన పంతానికి అభంశుభం తెలియని పసిబిడ్డ బలైపోవడం శ్రీకాళహస్తివాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది. మూడు నెలల మగబిడ్డను కన్నతండ్రే నేలకేసి కొట్టి చంపేశాడన్న వార్త శనివారం ఉదయం పట్టణంలో ఒకసారిగా దావాలనంలా వ్యాపించింది. సంఘటన జరిగిన వాటర్‌హౌ్‌సకాలనీకి చుట్టుపక్కల జనం పెద్దఎత్తున చేరుకున్నారు. మునిరాజ ఇంటిముందున్న పసిబిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. విచారణ నిమిత్తం వచ్చిన సీఐ అంజూయాదవ్ సైతం విగతజీవిగా ఉన్న బిడ్డను చూసి వెక్కివెక్కి ఏడ్చేశారు.
శ్రీకాళహస్తి మండలం వేడాం పంచాయతీలోని చిన్నమిట్టకండ్రిగ గ్రామానికి చెందిన పెయింటర్ మునిరాజ అలియాస్ అనిల్‌కుమార్(25) అదే గ్రామానికి చెందిన సమీప బంధువు స్వాతిని రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమవివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజులకే స్వాతి అత్తింట్లో ఇమడలేకపోయింది. తరచూ గొడవలు జరగడంతో మునిరాజ శ్రీకాళహస్తిలో వేరు కాపురం పెట్టాడు. అత్తమామలతో మాట్లాడడం కూడా మానేసిన స్వాతికి మూడు నెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. వారం రోజుల క్రితం పుట్టింటి నుంచి బిడ్డతో స్వాతి భర్త వద్దకు వచ్చింది. అప్పటి నుంచి నెమ్ముతో నిఖిల్ ఇబ్బంది పడుతూనే వున్నాడు. మునిరాజ బిడ్డను తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఖర్చుల కోసం తన ద్విచక్ర వాహనాన్ని సైతం అమ్మేసి రూ.30వేలు ఖర్చు చేశాడు. రెండు రోజుల క్రితమే బిడ్డను ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ శుక్రవారం రాత్రి నిఖిల్‌కు తీవ్ర జ్వరం రావడంతో సరిగా వైద్యం చేయించలేదంటూ భర్తను స్వాతి నిలదీసింది.
వెంటనే బిడ్డకు వైద్యం అవసరమని మునిరాజ చెప్పడంతో అతడి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై వాటర్‌హౌ్‌సకాలనీకి చేరుకున్నారు. తన తండ్రి ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి వెళ్లేందుకు మునిరాజ సిద్ధమయ్యాడు. అయితే మామ వాహనంలో తాను ఆస్పత్రికి రానంటూ స్వాతి భీష్మించింది. బిడ్డ అల్లాడిపోతుంటే ఈ పంతం ఏమిటని స్వాతికి అత్త సర్దిచెప్పబోయింది. అయితే స్వాతి వినకుండా ఆమెతో గొడవ పెట్టుకోవడంతో మునిరాజలో విచక్షణ నశించింది. ఏడుస్తున్న బిడ్డను అలాగే సిమెంటు రోడ్డుపై విసిరికొట్టాడు. ఒకసారిగా బిడ్డ స్పందన ఆగిపోయింది. హుటాహుటిన వైద్యశాలకు తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బిడ్డ చనిపోయినా స్వాతి పంతం వీడలేదు.అత్తమామలు ఎత్తుకున్నారన్న సాకుతో ఉదయం వరకు బిడ్డ శవాన్ని కూడా తాకలేదు. శనివారం ఉదయం సీఐ అంజూయాదవ్ సిబ్బందితో కలిసి వాటర్‌హౌ్‌సకాలనీకి చేరుకుని మునిరాజను అదుపులోకి తీసుకున్నారు.స్వాతి పంతాన్ని గురించి తెలుసుకుని మందలించారు.స్వయంగా బిడ్డను తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టారు.