Share News

కందిపప్పు కొందరికే

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:22 AM

రేషన్‌ దుకాణాల్లో ఈనెల కందిపప్పు దాదాపు 40 శాతానికే అందుతోంది. డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

 కందిపప్పు కొందరికే

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రేషన్‌ దుకాణాల్లో ఈనెల కందిపప్పు దాదాపు 40 శాతానికే అందుతోంది. డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పలువురు కార్డుదారులు కందిపప్పు కోసం డిమాండు చేస్తున్నారు. జిల్లాలోని 1457 రేషన్‌ దుకాణాల పరిధిలో దాదాపు 5,91,318 కార్డులకు 530 టన్నుల కందిపప్పు అవసరం. అయితే 210 టన్నులు మాత్రమే సరఫరా అయింది. తెలుగు రాష్ట్రాల్లో కందుల దిగుబడి భారీగా తగ్గిపోవడమే కారణమని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా అక్కడా ఇదే కొరత పట్టి పీడిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన కొద్దిపాటి కందిపప్పునూ డీలర్లు ఎంతమందికి ఇస్తున్నారన్నది ప్రశ్నార్థకం. కొందరు డీలర్లు కందిపప్పునకూ బయోమెట్రిక్‌లో కార్డుదారుల వేలి ముద్ర వేయించుకుని ఇవ్వడంలేదన్న ఆరోపణలున్నాయి. స్టాక్‌ రాలేదని చెబుతున్నారట. ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. అలాంటి వారికి ఇస్తున్నట్లు తెలిసింది. ఇక, చక్కెర కూడా 400 టన్నులు అవసరం కాగా, 175 టన్నులే సరఫరా అయింది. ‘జిల్లాకు అవసరమైన కందిపప్పు, చక్కెర రాలేదు. దీంతో పూర్తి స్థాయిలో కార్డుదారులకు పంపిణీ చేయడం కష్టంగా ఉంది. దీనిపై కలెక్టర్‌, జేసీకి నివేదికలు సమర్పించాం. ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని చోట్ల బియ్యానికి బదులు జొన్నలు పంపిణీ చేస్తున్నారు’ అని డీఎ్‌సవో శేషాచలం రాజు తెలిపారు.

Updated Date - Apr 05 , 2025 | 02:22 AM